చార్ ధామ్ భక్తులకు శుభవార్త.. రోజువారీ పరిమితి ఎత్తివేత

చార్ ధామ్ భక్తులకు శుభవార్త.. రోజువారీ పరిమితి ఎత్తివేత

డెహ్రాడూన్: చార్ ధామ్ ను సందర్శించాలనుకుంటున్న భక్తులకు నిజంగా శుభవార్త. కరోనా మార్గదర్శకాలకు మేరకు విధించిన రోజువారీ పరిమితిని తొలగించాలన్న అభ్యర్థనకు ఉత్తరాఖండ్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రోజువారీ పరిమితిని తొలగించేందుకు అంగీకరిస్తూనే కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 
రోజువారీ పరిమితి వల్ల చార్ ధామ్‌కు వచ్చే భక్తులపై ఆధారపడి చిన్న చితక వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వేల మంది పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టి పరిస్థితి అదుపులోనే ఉన్నందున పరిమితిని తొలగించాలని కోరుతూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును జస్టిస్ ఆర్‌సీ ఖుల్బే, జస్టిస్ అలోక్ కుమార్ డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
గత నెలలో చార్ ధామ్ యాత్రపై నిషేధాన్ని ఎత్తేసిన హైకోర్టు తాజాగా రోజువారీ పరిమితిని కూడా ఎత్తేసింది. అయితే కోవిడ్ మార్గదర్శకాల మేరకు సందర్శకులు, యాత్రికులు పాజిటివ్ నివేదిక, వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉన్న సర్టిఫికెట్లతో సందర్శించేందుకు అనుమతిచ్చింది. అలాగే దేవాలయాల చుట్టూ ఉన్న చెరువుల్లో భక్తులెవరూ స్నానాలు చేయకూడదని.. నిర్వాహకులు పర్యవేక్షణ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో  కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శకులకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే.