ఐటీ విచారణల నుంచి విముక్తి
ఏంజెల్ ఇన్వెస్టర్లకు మరింత స్వేచ్ఛ
సెప్టెంబరు నుంచి కొత్త విధానం
ఈసారి బడ్జెట్ స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి పలు చర్యలను ప్రకటించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇలాంటి కంపెనీలు మరింత సులువుగా వ్యాపారం చేసుకునేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్టార్టప్‌లకు నిధులు అందించే ఏంజెల్ ఇన్వెస్టర్లకు ఐటీ అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త ట్యాక్స్ రిటర్నుఫారాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అర్హులైన వ్యక్తులు/కంపెనీలే స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేశాయా లేదా ? అనే విషయాన్ని ధ్రువపర్చుకోవడానికి ఈ కొత్త ట్యాక్స్ ఫారాలు ఉపయోగపడుతాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లకు ఈ–వెరిఫికేషన్ సదుపాయం కల్పిస్తామన్న మంత్రి నిర్మల హామీ మేరకే ఈ ఫారాలను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ఇక నుంచి ఐటీ అధికారులు స్టార్టప్‌లను, ఏంజిల్ ఇన్వెస్టర్లను నేరుగా ప్రశ్నించే అవకాశం ఉండదు.
ఐటీ రిటర్నుల ద్వారా స్టార్టప్‌ల, ఇన్వెస్టర్ల నిష్పాక్షితను పరిశీలించాలన్న ఆలోచనను స్వాగతించాలని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. డేటా మైనింగ్, ఇంటెలిజెన్స్ గేదరింగ్ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినందున ఇన్వెస్టర్ల పూర్తి సమాచారాన్ని కనుక్కోవడం చాలా సులువని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ పార్ట్‌నర్ అమిత్ మహేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐటీ రిటర్నుల ఫారాల్లో కొన్ని మార్పులు చేసింది. స్టార్టప్‌ల షేర్‌హోల్డింగ్, ఇన్వెస్టమెంట్ల వివరాలను అందించేందుకు కొన్ని శీర్షికలను ప్రవేశపెట్టింది. ఫలితంగా ఇన్వెస్టర్ల, నిధుల మూలాల వివరాలను ఈ–వెరిఫికేషన్ ద్వారా సులువుగా తెలుసుకోగలుగుతారు. వివరాలు సరిగ్గా ఉంటే తదనంతరం ఐటీశాఖ ఏరకంగానూ జోక్యం చేసుకోదు. స్టార్టప్‌ల పాత కేసుల దర్యాప్తులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది.
