తెలంగాణ పోలీసు సిబ్బందికి శుభవార్త..

తెలంగాణ పోలీసు సిబ్బందికి శుభవార్త..
  • ఇళ్ల నిర్మాణాలకు రుణ పరిమితి పెంపు
  • పిల్లల విదేశీ చదువుల రుణ పరిమితి కూడా పెంపు

హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ అధికారులు సిబ్బంది అందరికీ పోలీసు బాస్ డీజీపీ మహేందర్‌రెడ్డి శుభవార్త చెప్పారు. క్షేత్ర స్థాయిలో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు, క్లరికల్ సిబ్బందికి అందరికీ ఇంటి నిర్మాణానికి రుణపరిమితిని పెంచారు. వడ్డీ కాస్త ఎక్కువగా ఉందన్న అసంతృప్తిని సమూలంగా తొలిగంచేందుకు వడ్డీని కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భద్రత– ఆరోగ్య భద్రత ట్రస్ట్‌ బోర్డు మీటింగ్‌లో..పోలీసు సిబ్బంది వ్యక్తిగత సంక్షేమంపై చర్చ జరిగింది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్లాటు కొనుగోలు వడ్డీరేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. అలాగే పిల్లల విదేశీ విద్యా రుణాలను అన్ని హోదాల్లోని వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం తీసున్న నిర్ణయాలను తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి తదితరులు స్వాగతించారు. డీజీపీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 
ఇంటి నిర్మాణానాకి రుణ పరిమితి
కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై స్థాయి దాకా రూ. 35 లక్షల నుంచి 40 లక్షలు
ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షల నుంచి 50 లక్షలు
డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి 60 లక్షలు
ఐపీఎస్‌లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు రుణ పరిమితి పెంచారు. 
ప్లాటు కొనుగోలు కోసం రుణ పరిమితి
కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు
ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు
డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు
ఐపీఎస్‌ అధికారులకు రూ.40 లక్షల నుంచి 45 లక్షలకు రుణ పరిమితిని పెంచారు.