టూరిస్టు, బిజినెస్ వీసాలతో వెళ్లిన వారూ అమెరికాలో జాబ్​ వెతుక్కోవచ్చు

టూరిస్టు, బిజినెస్ వీసాలతో వెళ్లిన వారూ అమెరికాలో జాబ్​ వెతుక్కోవచ్చు
  •     అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయినవారూ ‘బీ’ వీసాలతో ఉండే అవకాశం
  •     ట్విట్టర్​ ద్వారా వెల్లడించిన ఇమిగ్రేషన్ శాఖ

వాషింగ్టన్: జాబ్ సెర్చ్​కోసం అమెరికాకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. బిజినెస్​వీసా  (బీ‌‌–1), టూరిస్టు వీసా (బీ–2) పై అమెరికాకు వెళ్లేవారు ఇకపై ఉద్యోగాలకు అప్లై చేసుకోవడంతో పాటు ఇంటర్వ్యూలకూ అటెండ్​ కావచ్చు. అయితే, ఉద్యోగం వచ్చాక అందులో చేరాలంటే మాత్రం తప్పనిసరిగా వీసాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా సిటిజెన్​షిప్ అండ్​ ఇమిగ్రేషన్​సర్వీసెస్​ విభాగం ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

జాబ్స్ కోల్పోయిన ఇతరదేశాల వారు 60 రోజుల గ్రేస్ పీరియడ్​లోగా అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందనే ఆందోళనలో ఉన్నారని.. ఇకపై బీ1, బీ2 వీసాల ద్వారా ఇక్కడే ఉంటూ కొత్త జాబ్స్​కు ట్రై చేసుకోవచ్చని తెలిపింది. జాబ్స్​ కోల్పోయిన సందర్భాల్లో వీసాను ‘బీ గ్రేడ్’ (బీ1 లేదా బీ2)కు అప్​డేట్​ చేసుకొని ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చని సూచించింది. ఆర్థిక సంక్షోభ భయాలతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు భారత్​సహా వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగించాయి. వారంతా 60 రోజుల గ్రేస్ పీరియడ్​లోగా కొత్త జాబ్స్​ను వెతుక్కునే ప్రయత్నాల్లో  ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఊరట కలిగించేందుకే అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

దీనిపై ట్విట్టర్​ వేదికగా పలువురు నెటిజన్స్​ అడిగిన డౌట్స్​ను అమెరికా ఇమిగ్రేషన్​ విభాగం క్లియర్​ చేసింది. సాధారణంగా అమెరికాలో పనిచేసే విదేశీ టెక్​ నిపుణులకు హెచ్​–1బీ వీసాలు ఇస్తారు. వీరు జాబ్స్​ కోల్పోయినప్పుడు 60 రోజుల గ్రేస్ పీరియడ్​లోగా కొత్త జాబ్​ వెతుక్కోవాలనే నిబంధన ఉంది. ఈ గడువును ఒక సంవత్సర కాలానికి పొడిగించాలంటూ ఇటీవల రెండు ఇండియన్ అమెరికన్ సంస్థలు ప్రెసిడెంట్​బైడెన్​కు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే టెక్​ నిపుణులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.