శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఆ తరువాత భక్తుల సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తామని టీటీడీ ప్రకటించింది. 

ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ, బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు చాలా వరకు తగ్గిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామని చెప్పారు.  ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందన్నారు. 

మరోవైపు శ్రీవారి భక్తుల కోసం మరో 10 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులకు ధర్మరథం అని పేరు పెట్టారు.  మొత్తం 18 కోట్ల రూపాయల విలువ చేసే ఈ బస్సులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ- టీటీడీకి విరాళంగా అందజేసింది. తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వాహన కాలుష్యాన్ని నివారించడానికి వీటిని వినియోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.