- 21 నుంచి దరఖాస్తులు, నవంబర్ 10న రాత పరీక్ష
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంగ్లిష్ మీడియంలోనే ఎగ్జామ్
- కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్2) పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులకు అక్టోబరు 5 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. నవంబరు 10న రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షను రెండు లేదా మూడు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. పేపర్ ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
95 శాతం పోస్టులు స్థానికులకే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసేవాళ్లకు వెయిటేజ్ మార్కులు కల్పించారు. అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయోపరిమితి ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు సడలింపు ఇచ్చారు. పోస్టుల్లో 95 శాతం స్థానికులకేనని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఏడు వరకు ఇక్కడ చదవకుంటే, తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధృవపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
80 మార్కులకు రాత పరీక్ష
ఈ పోస్టుల నియామక ప్రక్రియ 100 పాయింట్స్ ప్రాతిపదకనగా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజ్ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిజేస్తే వెయిటెజ్ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇం దులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్స్ కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్స్ ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజ్ మార్కులొస్తాయి. పోస్టుల వివరాలను వెబ్‌సైట్‌లో www.mhsrb.telangana.gov.in పొందుపర్చారు. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత గూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణాలను పరీక్షా కేంద్రాల కింద ఎంపిక చేశారు.
విద్యార్హతలివే..
అభ్యర్థులు ల్యాబ్ టెక్నిషీయన్ కోర్స్ చేసి ఉండాలి. ఎంఎల్ వోకేషనల్, ఇంటర్లో ఎంఎల్ ఓకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షన పొందిన వారూ అర్హులే. డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషీయన్ కోర్స్(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డొప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్( క్లినికల్ పాథాలజీ) టెక్నిషీయన్ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులని మెడికల్ బోర్డు పేర్కొంది.
పోస్టుల వివరాలు:
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ 1,088
వైద్య విధాన పరిషత్ 183
ఎంఎన్‌జే హాస్పిటల్ 13
జోన్లవారీగా..
జోన్ 1 218
జోన్ 2 135
జోన్ 2 173
జోన్ 4 191
జోన్ 5 149
జోన్ 6 220
జోన్ 6 185