Good News : రూ.5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

Good News : రూ.5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

దేశంలో ఏడాదిగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకు కదలిక రాబోతున్నది. ఈసారి పెరగటం కాదు.. తగ్గటం అంటున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇప్పటికే లాభాల్లోకి వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ధరలు తగ్గించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. అయితే ఎంత తగ్గిస్తారు.. ఎప్పుడు నుంచి తగ్గిస్తారు అనే ప్రశ్నకు.. 2023, జూన్ 22వ తేదీ సమాధానం ఇచ్చాయి. 

లీటర్ పెట్రోల్ పై కనీసం నాలుగు రూపాయలు.. గరిష్టంగా ఐదు రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇది ఇప్పటికి ఇప్పుడే అమల్లోకి రాదని.. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గింపు ఉండొచ్చని చెబుతున్నాయి. కచ్చితమైన తేదీ ప్రకటించకపోయినా.. లీటర్ పెట్రోల్ పై నాలుగైదు రూపాయల తగ్గటం మాత్రం ఖాయంగా తేలిపోయింది. 

ఇక డీజిల్ విషయంలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. లీటర్ డీజిల్ పైనా నాలుగైదు రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని స్పష్టం చేశాయి.

నవంబర్ – డిసెంబర్ నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం ఉండొచ్చని చెబుతున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల నుంచి కూడా ధరలను తగ్గించాలనే డిమాండ్ వస్తుందని.. ఈ క్రమంలోనే ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ పై నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని.. అయితే అప్పటి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలను కూడా అంచనా వేసి.. ఎంత తగ్గింపు అనేది ఫైనల్ చేస్తామని కూడా చెబుతున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.