ఈ- లెర్నింగ్ కంపెనీల ట్యూషన్లకు మంచి రెస్పాన్స్

ఈ- లెర్నింగ్ కంపెనీల ట్యూషన్లకు మంచి రెస్పాన్స్
  • సిటీలో పెరిగిన బ్రాంచ్​లు 
  • ప్రముఖ విద్యాసంస్థలదీ ఇదే బాట
  • లెర్నింగ్ ​గ్యాప్​ పోగొట్టేందుకు పేరెంట్స్ ​ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్​లో స్కూళ్లు, కాలేజీలు బంద్‌‌ అవడంతో పిల్లల చదువులు ఆన్‌‌లైన్‌‌కి షిఫ్ట్ అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలతోపాటు ఈ-–ఎడ్యుకేషన్ కంపెనీలు డిజిటల్‌‌ మోడ్‌‌లో పాఠాలు మొదలుపెట్టాయి. ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చినా  క్లాస్​రూమ్ ​చదువుకు దూరమవడంతో పిల్లలు కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడిపోయారు. కరోనా పరిస్థితులు పోయి పూర్తిస్థాయిలో స్కూళ్లు, కాలేజీలు మొదలైనా పిల్లలు ఇంకా ఇంతకు ముందు స్థాయికి చేరుకోలేకపోతున్నారు. చాలా మంది లాంగ్వేజ్​లు, ఇతర సబ్జెక్టులు మర్చిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు స్కూల్​అయిపోయాక మళ్లీ ప్రత్యేకంగా ట్యూషన్​కు పంపిస్తున్నారు. దీంతో ట్యూషన్ల సంఖ్య పెరిగిపోయింది. మొన్నటి దాకా ఆన్​లైన్​లో పాఠాలు చెప్పిన పలు ఈ– లెర్నింగ్‌‌ కంపెనీలు కూడా డిమాండ్​కు తగ్గట్టుగా ఆన్​లైన్ మోడ్​నుంచి ఆఫ్​లైన్​కు షిఫ్ట్ అయ్యాయి. ఇప్పటికే సిటీలో పదుల సంఖ్యలో బ్రాంచ్​లు ఓపెన్​చేశాయి. ఓ వైపు డిజిటల్ ​పాఠాలు కొనసాగిస్తూనే ఆఫ్‌‌లైన్‌‌ ట్యూషన్లు చెబుతున్నాయి. క్వాలిఫైడ్ టీచర్లను నియమించుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల్లో లెర్నింగ్ గ్యాప్‌‌ పోగొట్టి, సబ్జెక్ట్ నాలెజ్డ్ మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు కూడా ట్యూషన్లకు పంపించేందుకు మొగ్గు చూపుతున్నారు.

నెలకు రూ.5 వేల దాకా ఫీజు

బైజూస్, వేదాంతు, వైట్ హాట్ జూనియర్, ఎడ్యుటెక్ లాంటి ఈ– ఎడ్యుకేషన్​ కంపెనీలు కరోనా టైంలో ఆన్​లైన్ ​క్లాసులు అందించాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆఫ్​లైన్​లోనూ పాఠాలు చెబుతున్నాయి. సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో తమ సెంటర్లను ప్రారంభించాయి. బైజూస్‌‌కి సిటీ వ్యాప్తంగా ఎనిమిది సెంటర్లు ఉన్నాయని ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షుడు షబ్బీర్ అలీ తెలిపారు. ప్రస్తుతం వీటికి పేరెంట్స్‌‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, చాలా మంది స్టూడెంట్స్‌‌ వీటిలో చేరుతున్నారని తెలిపారు. నెలకి రూ.5 వేలు ఫీజున్నా కట్టి జాయిన్​చేస్తున్నారు.

హైబ్రిడ్​ మోడ్..

ఐటీ కంపెనీల తరహాలో ఎడ్యుకేషన్ సెంటర్లు కూడా హైబ్రిడ్ మోడ్​ను పాటిస్తున్నాయి. ఈ-లెర్నింగ్ కంపెనీలు ఆఫ్​లైన్‌‌కి షిఫ్ట్ అయితే శ్రీ చైతన్య, నారాయణ వంటి సంస్థలు ఆఫ్​లైన్​తో పాటు ఆన్​లైన్‌‌ పాఠాలు చెబుతున్నాయి. ఆఫ్​లైన్ ట్యూషన్‌‌ సెంటర్లలో మార్నింగ్‌‌, ఈవెనింగ్‌‌ క్లాసులు చెప్తున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలు మొదలైనప్పటికీ ట్యూషన్ సెంటర్లకు, హోం ట్యూటర్లకు మంచి డిమాండ్ ఉంది. కొంతమంది పేరెంట్స్ ట్యూటర్లను ఇంటికి పిలిపించి క్లాసులు చెప్పిస్తున్నారు. 

పిల్లల ఫ్యూచర్‌‌‌‌ కోసం తప్పట్లేదు

మా ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. గత రెండేళ్లుగా వాళ్లు సరిగా చదవడం లేదు. అంతకు ముందు నేర్చుకున్నవి కూడా మర్చిపోయారు. అందుకే ఈ సారి స్కూల్ మార్చాం. ఇద్దరికీ కలిపి దాదాపు 70 వేలు ఫీజు అవుతోంది. కానీ అబ్బాయి చదువులో ఏం మార్పు కనిపిస్తలేదు. భయంతో మళ్లీ ట్యూషన్‌‌కి పంపిస్తున్నాం. మాలాంటి వాళ్లకు అటు స్కూల్ ఫీజు, ఇటు ట్యూషన్ ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. పిల్లల ఫ్యూచర్‌‌‌‌ కోసం తప్పడం లేదు.

- ఈశ్వర్, పేరెంట్, షేక్‌‌పేట

స్పెషల్​ కేర్​ఉంటుందని..

స్కూళ్లలో లక్షల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు. కానీ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. ఈ ఏడాదైనా పిల్లలు పికప్​అవుతారని భావించాం. కానీ మార్పు కని పించలేదు. స్పెషల్ కేర్ ఉంటుందని ట్యూషన్​కు పంపిస్తున్నాం. 

- ప్రేమ్, పేరెంట్, కూకట్‌‌పల్లి

క్వాలిఫైడ్ ​టీచర్ల సంఖ్య తగ్గింది

కరోనా టైమ్​లో ఆన్‌‌లైన్‌‌ క్లాసులు జరిగినప్పటికీ వాటితో ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ పిల్లలు తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్లలోనూ క్వాలిఫైడ్ టీచర్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మెరుగు పరిచేందుకు చాలామంది పేరెంట్స్‌‌ పిల్లలను ట్యూషన్లకు పంపుతున్నరు. కరోనా టైమ్​లో ఉద్యోగాలు కోల్పోయిన ఎక్స్‌‌పీరియన్స్ ​ఉన్న టీచర్లను ఆయా ఈ-లెర్నింగ్​సంస్థలు తీసుకుని ట్యూషన్లు చెప్పిస్తున్నాయి. పేరెంట్స్ కూడా ధైర్యంగా పంపిస్తున్నారు.

- షబ్బీర్ అలీ, అధ్యక్షుడు, 
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్