కొత్త ఐటీ రూల్స్‌‌కు ఓకే చెప్పిన గూగుల్, ఫేస్‌బుక్

కొత్త ఐటీ రూల్స్‌‌కు ఓకే చెప్పిన గూగుల్, ఫేస్‌బుక్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌‌కు గూగుల్, ఫేస్‌‌బుక్ ఓకే చెప్పాయి. ఈ మేరకు కొత్త ఐటీ రూల్స్‌పై లింక్డ్‌ఇన్, టెలీగ్రామ్, గూగుల్, ఫేస్‌‌బుక్, వాట్సాప్‌‌‌లు తమ ఆమోదాన్ని తెలుపుతూ ఐటీ మినిస్ట్రీకి డీటెయిల్స్‌‌ను షేర్ చేశాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీకి భారత్‌లో సంబంధిత అధికారులు ఉండాలన్న నిబంధనకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి తెలిపాయి. కానీ ట్విట్టర్ మాత్రం ఐటీ మినిస్ట్రీకి ఎలాంటి లేఖను పంపలేదని సమాచారం. కాగా, సోషల్ మీడియా కట్టడి కోసం కేంద్ర ఐటీ మినిస్ట్రీ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఇవే.. ప్రతి సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు చేపట్టాలి. ఈ రూల్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూ వర్తిస్తాయి. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర సంస్థలు గ్రీవియన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ను నియమించాలి. ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వాటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి.