ఐటీ షాక్ : గూగుల్ లో మరోసారి ఉద్యోగుల తీసివేత.. AI ఎఫెక్ట్ అని ప్రకటన

ఐటీ షాక్ : గూగుల్ లో మరోసారి ఉద్యోగుల తీసివేత.. AI ఎఫెక్ట్ అని ప్రకటన

ఐటీ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. వాళ్లూ.. వీళ్లూ చెబుతున్నది కాదు.. గూగుల్ స్వయంగా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులు అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని.. ఇది కష్టమైన నిర్ణయం అయినా కంపెనీ భవిష్యత్ కోసం తప్పదని స్వయంగా ప్రకటించారు గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శర వేగంగా వస్తుందని.. అందుకు అనుగుణంగా.. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో.. కంపెనీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని చేర్పులు మార్పులు చేయటం జరుగుతుందని గూగుల్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశం ఇచ్చారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్. ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదని.. కాలంతోపాటు మారాల్సిన అవసరం ఉందని.. కఠినమైన నిర్ణయాలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని.. అప్పుడే కంపెనీ మనుగడ అంటూ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది గూగుల్. 

 పునర్ వ్యవస్థీకరణలో భాగంగా  కొంత మంది ఉద్యోగులను  ఇతర  వీధుల్లోకి గూగుల్ బదిలీ చేస్తోంది.  భారత్ లో గూగుల్  ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుంది. ఎంత మందిని బదిలీ చేస్తుందనేది తెలియదు.. కానీ  ఇది ఐటీ రంగంపై పెను ప్రభావం చూపుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. 

Also Read: ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ రిపోర్ట్

చాట్ జీపీటీ వచ్చిన తర్వాత.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న ఈ క్రమంలో.. గూగుల్ భారీ ఎత్తున రీ ఇంజినీరింగ్ వ్యవహారాలపైనే దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం క్రమంలోనే ఇప్పటికే 12 వేల మందిని తీసేయగా..  గూగుల్ నుంచి సెకండ్ రౌండ్ లో 20 వేల మంది ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని భావిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా,అమెజాన్, యాపిల్ వంటి  సంస్థలు ఉద్యోగులను తీసేశాయి.   మున్ముందు  ప్రపంచవ్యాప్తంగా ఇంకా భారీగా ఉద్యోగాల కోత విధించే అవకాశం ఉంది. 2024లో ఇప్పటివరకు 58 వేల మంది టెక్ ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.