
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)ని గూగుల్ తన అరుదైన డూగుల్‌తో గౌరవించింది. ఈరోజు(ఆగస్టు 13) శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా ముంబయికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ భూమిక వేసిన శ్రీదేవి చిత్రాన్ని గూగుల్ తన డూడుల్‌గా పోస్ట్ చేసింది. తమ అభిమాన తార శ్రీదేవికి ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీదేవి భారతదేశం గర్వించ దగ్గ గొప్ప నటులలో ఒకరు. 1963లో జన్మించిన ఆమెకు.. చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 4 ఏళ్ల వయసులోనే కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం.. ఇంతింతై వటుడింతై అనే స్థాయిలో ముందుకు సాగింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ ఇలా భాషతో సంబంధంలేకుండా.. దాదాపు అందరు స్టార్స్ తో నటించారు శ్రీదేవి. ఈ ప్రయాణంలో ఆమె సాధించని విజయాలు లేవు, ఆమె అందుకొని అవార్డులు లేవు. అలాంటి ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం.
ఇక 2002 లో సినిమాల నుండి విరామం తీసుకున్న ఆమె.. 2004 లో వచ్చిన మాలినీ అయ్యర్ అనే సీరియల్ తో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కొన్ని టీవీ ప్రోగ్రాంలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. 2012 లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. ఇక 2018, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు చనిపోయారు శ్రీదేవి. తన అందం, అద్భుతమైన నటనతో సినీ ప్రేమికుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసారు శ్రీదేవి.