- సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు గూగుల్ బంపర్ ఆఫర్
- ఏఐ స్కిల్స్ టెస్ట్ చేయడానికే ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: గూగుల్ తన నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని అమలు చేయడానికి రెడీ అవుతోంది. తాను ఇంటర్వ్యూ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కోడింగ్ టైమ్‌లో ఏఐ టూల్స్ వాడుకోవడానికి అనుమతివ్వనుంది. అంతేకాకుండా తన సొంత ఏఐ అసిస్టెంట్ 'జెమిని' ని కోడింగ్ రౌండ్లలో ఉపయోగించేలా కొత్త ఫార్మాట్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ ఏడాది చివరిలో అమెరికాలోని గూగుల్ క్లౌడ్ టీమ్స్‌లో పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.
జూనియర్, మిడ్-లెవల్ ఇంజనీరింగ్ ఉద్యోగులను నియమించుకోవడంలో ఈ విధానాన్ని వాడనుంది. 'కోడ్ కాంప్రహెన్షన్' రౌండ్‌లో అభ్యర్థులు జెమిని సహాయంతో సాఫ్ట్‌వేర్ కోడ్‌ను రివ్యూ చేయడం, డీబగ్ చేయడం, మెరుగుపరచడం వంటివి చేసుకోవడానికి వీలుంటుంది. అభ్యర్థులు ఏఐని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారో ఇంటర్వ్యూయర్లు గమనిస్తారు.
కేవలం కోడింగ్ సామర్థ్యమే కాకుండా, సరైన ప్రాంప్ట్‌లు ఇవ్వడం, ఏఐ ఇచ్చే సమాధానాలను సరిచూసుకోవడం, ఇది చేసిన తప్పులను గుర్తించడం వంటి స్కిల్స్‌ను కూడా అంచనా వేస్తారు. గూగుల్‌లో ఇప్పటికే అధిక శాతం కోడ్‌ను ఏఐ సాయంతో రాస్తోంది. అందుకే నిజమైన పని వాతావరణానికి తగ్గట్లుగా ఇంటర్వ్యూలు ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది.
టెక్ ఇండస్ట్రీపై ప్రభావం..
ఎలాంటి బయట సహాయం లేకుండా సమస్యలను పరిష్కరించడంపై కోడింగ్ ఇంటర్వ్యూలు దృష్టి పెడతాయి. కానీ గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్ రంగంలో నియామక పద్ధతులను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఆధునిక ఇంజనీర్లు ప్రతిరోజూ ఏఐ టూల్స్‌ను వాడుతుండడంతో ఇంటర్వ్యూలు కూడా అలాగే ఉండాలని మద్దతుదారులు వాదిస్తుండగా, ఈ విధానంతో అభ్యర్థి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అంచనా వేయడం కష్టమవుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
