మే 5న ‘రామబాణం’ రిలీజ్

మే 5న  ‘రామబాణం’ రిలీజ్

కాంబినేషన్ కాకుండా కథను నమ్మి చేసిన సినిమా ‘రామబాణం’ అంటున్నాడు గోపీచంద్. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్‌‌‌‌లో గోపీచంద్ నటించిన మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఇవ్వాళ  ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘నేను కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలే చేస్తున్నా.  ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులైంది. ఇందులో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. జగపతిబాబు నాకు అన్నగా చేశారు. ఆయనతో నాకిది రెండో సినిమా. ఆయనను కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది.

అందుకే మా మధ్య సీన్స్ బాగా వచ్చాయి. బ్రదర్ ఎమోషన్‌‌‌‌కు బాగా కనెక్ట్ అవుతారు.  కుష్బూ నాకు వదినగా నటించారు. కాలేజీ రోజుల్లో ఆమె సినిమాలు చూసి, ఇప్పుడు ఆమెతో కలిసి సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కమర్షియల్ ఫార్మాట్‌‌‌‌లో వెళ్తూనే.. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాలు చూసే కోణం మారిందనే దానిలో నిజం లేదు. ఎన్నేళ్ళు అయినా ఎమోషన్స్ అలాగే ఉంటాయి. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అంతేకానీ ఆడియెన్స్ టేస్ట్ మారలేదు. ఏ సినిమాకైనా ఫ్యామిలీ ఆడియెన్సే ముఖ్యం. ప్రస్తుతం హర్ష దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా.  శ్రీను వైట్ల గారితో స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే తేజ గారితో కూడా సినిమా చేయాలి. ప్రభాస్‌‌‌‌కి విలన్‌‌‌‌గా నటించే చాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను’అన్నాడు.