- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : భారత రాజ్యాంగం ఆకాంక్షించిన కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని బాబు జగజీవన్ రామ్ భవన్‌లో సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మరెక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉందని, సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని నీచపు సంస్కృతి ఇంకా కొనసాగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కులాల వారీగా పండుగలు, ఉత్సవాలు నిర్వహించడాన్ని ఆయన విమర్శించారు. మనిషిని మనిషిగా ప్రేమించే సమానత్వ సంస్కృతి రావాలని, కులమతాల పేరిట సాగుతున్న అవమానాలను రూపుమాపాలని ఆయన కోరారు.

