
- ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నరు?
- జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తరా? లేదంటే కాంగ్రెస్‌నా?
- కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్
- జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు
- ‘ఏదో ఒకరోజు మీరూ పక్కాగా వెళ్తారు’ అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా? లేదంటే కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి” అని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
‘‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది. మీరు భారీ ఓట్లతోని ఓడిపోతే కేంద్ర పెద్దలకు మీ ముఖం ఎట్లా చూపెడతారు? కొద్దిగా ఆలోచన చేశారా” అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ‘‘మీకు ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌లో, డివిజన్‌లో వేలు పెట్టే అలవాటు ఉంది. కానీ ప్రస్తుతం మీ జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోనే చాలామంది వేలు పెడుతున్నారు. ఈ విషయం మీకు తెలుసా?” అని ప్రశ్నించారు.
‘‘హైదరాబాద్జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. ఏదో ఒకరోజు మీరు కూడా పక్కా బయటకు వెళ్తారు” అంటూ వ్యాఖ్యానించారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు. ఒవైసీ మీకు మంచి స్నేహితుడు కదా.. ఆయనను ఒకసారి అడగండి” అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.