బీజేపీలో ముసలం.. రాజాసింగ్ అలక.?

బీజేపీలో ముసలం.. రాజాసింగ్ అలక.?
  •     మహేశ్వర్ రెడ్డి వైపే కిషన్ రెడ్డి మొగ్గు
  •     రాజాసింగ్​ కోసం బండి సంజయ్​ పట్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీ నాయకత్వం సభాపక్ష నేత(ఎల్పీ) పదవి ఎవరికన్నది ఇంకా తేల్చకపోవడంపై గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన.. బుధవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎల్పీ పదవిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆశిస్తుండటంతో.. తమ వారికే ఈ పదవి దక్కాలనే పట్టుదలతో ఇద్దరు కీలక నేతలు రాజకీయం నడపడం రాష్ట్ర బీజేపీలో మరోసారి గ్రూప్ రాజకీయాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా.. లెజిస్లేచర్ పదవి కోసం ఓ వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇంకో వైపు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాజాసింగ్ ఇంతకు ముందు పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దీనిపై  కన్నేశారు. మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, గతంలో ఒకసారి ఆ పదవిని చేపట్టిన అనుభవం ఉంది. ఇక మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారే. దీంతో ఈ పదవి కోసం ఇటు రాజాసింగ్, అటు మహేశ్వర్ రెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది. రాజాసింగ్ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయనకు ఎల్పీ పదవి ఇవ్వాల్సిందేనని సంజయ్ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నాలు  సాగిస్తున్నారు. దీన్ని గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వం ముందు తన ప్రతిపాదనలు పెట్టారు. దీంతో ఇప్పుడు ఎల్పీ పదవి ఇటు కిషన్ రెడ్డికి అటు సంజయ్​కి ఛాలెంజ్​గా మారింది. ఈ ఇద్దరు కీలక నేతలు ఎవరికి వారే తన వారికే ఎల్పీ పదవి ఇప్పించుకొని రాష్ట్ర బీజేపీలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

సిటీపై ఫోకస్​?..

రాజాసింగ్​కు ఎల్పీ పదవిస్తే సిటీలో తన ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి.. మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపారనే ప్రచారం రాష్ట్ర పార్టీలో సాగుతోంది. కిషన్ రెడ్డికి సిటీలో చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రాజాసింగ్ వైపు మొగ్గు చూపారనే చర్చ కమల దళంలో నడుస్తోంది. అయితే రాజాసింగ్​కు తెలుగు భాషపై అంతగా పట్టు లేదని, హిందూత్వం తప్ప ఇతర సబ్జెక్టులపై ఆయనకు సరైన అవగాహన లేదనేది కిషన్ రెడ్డి వర్గం వాదన. అయితే సిటీలో ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే దానికి  రాజాసింగే కీలకమని, హిందూత్వం వల్లే పాత బస్తీలో మజ్లిస్​ను సవాల్ చేస్తున్నామనేది బండి సంజయ్ వర్గం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే బీజేపీ ఏకంగా 4 సీట్లు గెలుచుకుందని, అందుకే అదే జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలనేది కిషన్ రెడ్డి వర్గం వాదన. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇటు బీజేపీలో అటు రాష్ట్ర రాజకీయాల్లో ఎల్పీ పదవిపైనే చర్చ సాగుతోంది. ఎల్పీ లీడర్ లేని ఏకైక పార్టీగా ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ ఉన్నది. ఇది ఆ పార్టీ నాయకత్వానికి ఇబ్బందికర పరిణామంగా నిలిచింది.

22 తర్వాత నిర్ణయం

అసెంబ్లీలో బీజేపీ తరఫున మహేశ్వర్ రెడ్డి చురుగ్గా పాల్గొంటుండటం రాజాసింగ్ కు ఏమాత్రం రుచించడం లేదు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఎన్నికల ముందు పార్టీలో చేరిన మహేశ్వర్ రెడ్డికి పెద్దపీట వేయడంపై రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కినుక వహించారు.  బుధవారం ఆయన అసెంబ్లీకి రాలేదు. కాగా, ఈ నెల 22తో పార్లమెంట్ సమావేశాలు ముగియనుండటం, ఆ తర్వాతనే ఎల్పీ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రానున్నట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.