సొసైటీల్లో గాడితప్పుతున్న  పాలన అవినీతికి పాల్పడుతున్న పాలకవర్గాలు

సొసైటీల్లో గాడితప్పుతున్న  పాలన అవినీతికి పాల్పడుతున్న పాలకవర్గాలు
  •     ఇష్టారాజ్యంగా ఖర్చులు
  •     కొరవడిన అధికారుల పర్యవేక్షణ

కామారెడ్డి, వెలుగు : రైతులకు మెరుగైన సేవలందించాల్సిన సొసైటీల్లో పాలన గాడితప్పుతోంది. సొసైటీకి ఆయా మార్గాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కొన్ని చోట్ల పాలకవర్గాలు, ఆఫీసర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అండదండలతో సొసైటీల్లో అక్రమాలకు అంతులేకుండా పోతుంది. పాలకవర్గాలు రైతుల శ్రేయస్సు కోసం కాకుండా, స్వలాభం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లాలో 55 సొసైటీలు..

కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) ఉన్నాయి. ఇందులో 10 ‌‌‌‌సొసైటీల్లో కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. మరో 25 సొసైటీలు మధ్యరకంగా పని చేస్తుండగా, మిగతావాటిల్లో కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. కార్యకలాపాలు అధికంగా ఉన్న 10 సొసైటీలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వడ్లు, మక్కలు, సోయా లాంటి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎరువులు, సీడ్స్​అమ్మకాలతో ఆదాయం సమకూరుతుంది. ఏటా పండే వడ్లలో 80 శాతం సొసైటీలే కొనుగోలు చేస్తుంటాయి.

2022–23 వానాకాలం సీజన్​లో 320 సెంటర్ల ద్వారా 4,42, 656 మెట్రిక్​టన్నుల వడ్లు కొన్నారు. ఏటా ఒక్కో సొసైటీకి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని సొసైటీ నిర్వహణ, కొనుగోలు సెంటర్ల వద్ద సౌలత్​లు కల్పించడం, టార్పాలిన్ ​కవర్లు సమకూర్చడం లాంటి పనుల కోసం ఖర్చు పెట్టాలి.

ఇదీ పరిస్థితి..

వడ్ల కొనుగోళ్లతో అధిక ఆదాయం సమకూరుతుండడంతో కొన్ని చోట్ల ఇష్టారీతిన ఖర్చులు చేస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల సమయంలో అవసరమయ్యే సుతీలి, సెంటర్లలో సౌలత్​ల పేరిట లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారు. అదనంగా స్టాప్​ నియమించినట్లు, ప్యాడీ క్లీనర్ల  రిపేరింగ్, సొసైటీల ఆధ్వర్యంలో ఏమైనా ప్రోగ్రామ్స్​కు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటెండ్​ అయితే రూ.లక్షలు ఖర్చు చేసినట్లు లెక్క చూపుతున్నారు. వీటన్నింటికి సరైన బిల్లులు ఉండడం లేదు. ఆడిట్​వింగ్ కూడా ఫిర్యాదులు అందిన సొసైటీల్లోనే  లోతుగా పరిశీలిస్తున్నారని, మిగతా చోట్ల అంతంతమాత్రంగానే ఉంటుందనే  విమర్శలు ఉన్నాయి.

కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని కొన్ని సొసైటీ అకౌంట్లలో ఉండే ఫండ్స్​ను ముందస్తుగా డ్రా చేసి, తర్వాత కొన్ని నెలలకు సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్ల కొనుగోలు టైంలో ట్రక్​షీట్ల జారీకి, కొనుగోళ్లకు, రైస్​మిల్లులకు పంపిన స్టాక్​కు పొంతన ఉండడం లేదు. కాంటాలు వేసిన తర్వాత,  రైస్​మిల్లులకు వెళ్లిన తర్వాత కూడా చాలా సొసైటీల్లో రైతులకు వడ్ల పైసల చెల్లింపులో కోత విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని లింగంపేట సొసైటీలో నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుపెడుతున్నారని కొందరు సొసైటీ డైరెక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్​ 2019 నుంచి2022 చివరి వరకు రికార్డ్స్​పరిశీలించారు. రూ.73 లక్షల 8 వేల ఖర్చుకు సంబంధించి సరైన బిల్స్​ లేవని ఆఫీసర్​ రిపోర్ట్​ ఇచ్చారు. 4 ఏండ్లలో సుతిలీ​కొనుగోలుకే రూ.31 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారని, ఎంక్వైరీ చేసిన ఆఫీసర్​తన రిపోర్ట్​లో పేర్కొన్నారు. నెలరోజుల్లోగా సొసైటీ మీటింగ్​ నిర్వహించి రిపోర్ట్​ను ఆమోదించింది, లేనిది నివేదిక సమర్పించాలని జూన్​20న డిస్ర్టిక్ట్​ కోఆపరేటివ్​ ఆఫీసర్​ సొసైటీ చైర్మన్​కు ఆదేశాలు జారీచేశారు.

ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం..

సొసైటీల్లో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాం. ఆదాయ, వ్యయాలపై ఎప్పటికప్పుడు ఆడిట్​ ఉంటుంది. లింగంపేట సొసైటీలో రూ.73 లక్షల అమౌంట్​కు సంబంధించి సరైన బిల్లులు లేవని ఎంక్వైరీ ఆఫీసర్​ రిపోర్ట్​ ఇచ్చారు. దీని ఆధారంగా సొసైటీ పాలకులకు నోటీసులిచ్చాం. మేం మరో సారి స్క్రూట్నీ చేస్తున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం.

– వసంత, జిల్లా సహకార అధికారి, కామారెడ్డి