మళ్లీ దళితుల భూములకు ఎసరు!

మళ్లీ దళితుల భూములకు ఎసరు!

మహబూబ్​నగర్, వెలుగు: ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్​ కోసం మళ్లీ దళితుల భూములకే రాష్ర్ట ప్రభుత్వం ఎసరు పెడుతోంది. పోయిన సంవత్సరం ఆ భూముల జోలికి రామని, సర్కారు భూములే కేటాయిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు సైలెంట్​గా టీఎస్​ఐఐసీకి అప్పగించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. మహబూబ్​నగర్​జిల్లా హన్వాడ సమీపంలో సర్వే నంబర్ 718లో 3,174.30 ఎకరాల అసైన్డ్​ భూమి ఉంది. ఇందులో 2,178.34  ఎకరాలు ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​కు చెందినది. మిగతా 995.36 ఎకరాలు రెవెన్యూది. అయితే, 1981లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో దళితులకు సగం ఎకరా, ఎకరా, రెండు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా హన్వాడలోని సర్వే నంబర్​ 718లో 170 మంది దళిత రైతులకు 287.11 ఎకరాలు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. మిగతా 708.24 ఎకరాలు రెవెన్యూ పేరు మీదే ఉంది. మరో సర్వే నంబర్​456లో 65 మంది రైతులకు 64.3 ఎకరాల భూమిని పట్టా చేసి ఇచ్చారు. ప్రస్తుతం రైతుల పేరు మీదనే పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. అయితే, ఈ ఏడాది ఏప్రిల్​లో ఈ భూములను వాపస్ తీసుకొని ఫుడ్ ​ప్రాసెసింగ్​ యూనిట్​కు అప్పగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం పొలాల పొంటి రోడ్లు వేయడంతో రైతులు ఆఫీసర్లపై తిరగబడ్డారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం తమ భూములు ఇచ్చేదిలేదని ఆందోళన చేశారు. దీంతో వెనకడుగు వేసిన ఆఫీసర్లు ఫుడ్​ప్రాసెస్​యూనిట్​ కోసం సర్వే నంబర్​ 718లో రెవెన్యూ శాఖ పరిధిలో 708.25 ఎకరాలను కేటాయిస్తామని చెప్పారు.  

708 ఎకరాల భూమి ఎక్కడ?

నాలుగు నెలల కిందట సర్వే నంబర్ 718లో ఫారెస్ట్​, రెవెన్యూ భూములను గుర్తించేందుకు డ్రోన్​ ద్వారా ఆఫీసర్లు సర్వే చేయించారు. ఈ భూమి మొత్తం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​పరిధిలోకి వస్తుందని తేలింది. కానీ, రెవెన్యూ పరిధిలో మిగిలిన 708 ఎకరాలు ఎక్కడుందనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో ఆఫీసర్లు చేసేది లేక తిరిగి దళితుల భూమినే తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఎలాంటి నోటీసుఇవ్వకుండానే సైలెంట్​గా పనులు కానిచ్చారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా భూ వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. దాని ప్రకారం ఓ కంపెనీకి భూమిని హ్యాండోవర్​  చేస్తున్న లెటర్లు కూడా పంపించినట్లు సమాచారం.

హైకోర్టు స్టే ఉన్నా.. పట్టించుకుంటలేరు..

ఈ ఏడాది ఏప్రిల్​లో ఆందోళనకు దిగిన బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. జూలై 4, 2022లో సర్వే నంబర్​ 456లోని తమ భూమిని ప్రభుత్వ లాక్కునే ప్రయత్నం చేస్తోందని 37 మంది హైకోర్టులో రిట్​ పిటిషన్​ (27945/2022) దాఖలు చేసి, స్టే తెచ్చుకున్నారు. అలాగే జూలై 7, 2022లో సర్వే నంబర్​ 718లోని తమ భూమిని ఫుడ్​ ప్రాసెసింగ్​యూనిట్​ కోసం తీసుకుంటున్నారని 25 మంది హైకోర్టులో రిట్​ పిటిషన్​ (28010/2022) వేసి స్టే తెచ్చుకున్నారు. ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నా, ఆఫీసర్లు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు బాధిత రైతులతో నాలుగైదు సార్లు సంప్రదింపులు జరిపారు. ప్రస్తుత గవర్నమెంట్​ధర ఎకరాకు రూ.2 లక్షల వరకు ఉందని, భూములు ఇస్తే రూ.5 లక్షల వరకు పరిహారం వస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి రైతులు ఒప్పుకోకపోవడంతో రహస్యంగా పేపర్​ వర్క్​ను పూర్తి చేసి, భూములను టీఎస్​ఐఐసీకి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం.

కలెక్టర్​ను కలిసిన బాధిత రైతులు

టీఎస్​ఐఐసీకి భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేశారనే విషయం తెలుసుకున్న బాధిత రైతులు వారం కింద కలెక్టర్​ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేకుంటే భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ చట్టం కింద వర్తించే అన్ని రకాల బెనిఫిట్స్​ను తమకు కల్పించాలని విన్నవించారు.

భూమి ఇచ్చేది లేదు 

సర్వే నంబర్​718లో నాకు ఒక ఎకరం ఉంది. మా తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. బోరు లేకున్నా.. వర్షాధార పంటలు వేసుకుంటున్నాం. ఉన్న భూమిని గుంజుకుంటే ఎట్లా బతకాలె? మేం చస్తే బొంద పెట్టనీకి కూడా స్థలం లేదు. మా అమ్మానాన్నల సమాధులు కూడా ఇక్కడే ఉన్నయ్. ఎవరేంజేసినా మా భూములు మాత్రం ఇయ్యం. ప్రాణాలు పోయిన లెక్కచేయ్యం.
–రావుళ్ల మాసయ్య, హన్వాడ

భూములచ్చి మేమేం చేయాలే..

సర్వే నంబర్​456లో నాకు రెండు ఎకరాల భూమి ఉంది. కందులు, జొన్నలు వేసిన. మేం వ్యవసాయం చేసేటోళ్లం. అది లేకుంటే మాకు బుక్కెడు బువ్వ కూడా దొరకదు. వేరే ఏం చేసుకొని బతకాలే? మా భూములు గుంజుకోవాలని చూస్తే ఎట్లా?  మా పిల్లల పరిస్థితి ఏం కావాలే? మా భూములు తీసుకుంటే, దానికి బదులు భూములే ఇయ్యాలె. పరిహారం ఏమొద్దు.   
–అమినికుంట్ల నర్సింహులు, హన్వాడ

కోర్టుకు పోయినం..

సర్వే నంబర్​ 718లో నాకు నాలుగెకరాలుంది. నీళ్లు లేకపోవడంతో బోరు, బావి, చెక్​ డ్యామ్​ కట్టించుకున్నాం. ఇందు కోసం దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినం. మాకు ఈ భూమే ఆధారం. ఈ భూమి లేకుంటే మేం ఎక్కడికి పోవాలి? అందుకే మాకు న్యాయం చేయాలని కోర్టుకు పోయినం. సర్కారు మాపై దయ చూపాలె.

–గోనుల శంకరయ్య, హన్వాడ