
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్కగ అమలైతలేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ ఆర్థిక సంవత్సరం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసినప్పటికీ.. విడుదల చేసింది ముత్తెమంతే. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో చాలా స్కీములు ఇంకా పట్టాలు ఎక్కలేదు. బీసీలకు వెయ్యి కోట్లు అని ప్రకటించి, రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు దళితబంధు అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా మొదలేపెట్టలేదు. ఎస్టీలకు ఇచ్చే సబ్సీడీ స్కీములతో పాటు వారి గ్రామాలకు రోడ్లు కలగానే మిగిలాయి. ఇంకో రెండు నెలల్లో ఆ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ప్రభుత్వం ఇంకెప్పుడు ఇస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రశ్నిస్తున్నారు. సర్కార్ నుంచి లబ్ధి జరుగుతుందో లేదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం నాలుగు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు రూ.31,464 కోట్లు కేటాయించింది. ఇందులో గురుకులాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఇతరత్రా వాటికి చేసిన ఖర్చు రూ.2300 కోట్ల లోపే. ఎస్సీ, ఎస్టీ లకు ఇతర డిపార్ట్మెంట్ల స్కీము ద్వారా లబ్ధి జరిగినా దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద చూపెడుతోంది.
దళితబంధుకు రూ.17,700 కోట్లు.. ఒక్కరికి ఇవ్వలే
2022–23 లో ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం రూ.20,624 కోట్లు కేటాయించింది. ఇందులో దళితబంధు కోసం రూ.17,700 కోట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా పోయిన ఏడాది మే లోనే ఇచ్చింది. మొత్తం 118 నియోజవకర్గాల్లో 11 వేల 800 మంది కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది.
అయితే ఇంతవరకు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ ఊరించడమే తప్ప సర్కార్ సీరియస్‌గా ఈ స్కీమ్‌ను అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గానికి 1500 మందికి ఇస్తామని చెప్పి... దాన్ని కాస్త 500లకు తగ్గించి.. ఇప్పుడు అసలు ఇస్తరా ఇవ్వరా ? అనే పరిస్థితికి తీసుకువచ్చారంటున్నారు. దళితబందు పేరుతో ఎస్సీ డెవలప్మెంట్లో ఉన్న ఇతర రాయితీ స్కీములన్నీ అటకెక్కించారు. ఎస్సీ డెవపల్మెంట్లో సంక్షేమానికి చేసిన ఖర్చు రూ. 750 కోట్లు మాత్రమేనని ఒక ఆఫీసర్ తెలిపారు.
బీసీ యువతకు గుండు సున్నా
బీసీ వెల్ఫేర్ ను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది బీసీ సంక్షేమ కోసం బడ్జెట్లో రూ.5698 కోట్లు కేటాయించినప్పటికీ చేసిన ఖర్చు వెయ్యి కోట్ల లోపే ఉన్నది. ఇందులోనూ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, కల్యాణ లక్ష్మీ, ఇతరత్రా వాటికి ఇచ్చిన పాత బకాయిలే ఉన్నాయి. బీసీల కోసం ఏర్పాటు చేసిన 11 సమాఖ్యాలకు మూడేండ్లుగా కేటాయింపులే తప్ప ఫండ్స్ రిలీజ్చేయట్లేదు. పైగా ఈ ఆర్థిక సంవత్సరం బీసీలకు వివిధ రూపాల్లో రాయితీ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.1000 కోట్లు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి ఫైల్ పంపినప్పటికీ సీఎం ఆమోదం రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో ఇక రాదనే అంటున్నారు. దీంతో లక్షలాది మంది బీసీ యువత నోట్లో ప్రభుత్వం మట్టి కొట్టిందని విమర్శలు వస్తున్నాయి.
ఎస్టీలకు.. మైనార్టీలకు అరకొరగానే ఖర్చు
బంజరా, ఆదివాసీ భవనాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ‘గిరిజన బంధు’ తెరపైకి తెచ్చింది. దీంతో ఏటా యథావిధిగా అమలు కావాల్సిన స్కీములు కూడా అటకెక్కాయి. 2022–23లో రూ.3415 కోట్లు ఎస్టీ డిపార్ట్మెంట్ కేటాయిస్తే ఇందులో ఎస్టీల వెల్ఫేర్‌కు ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.100 కోట్లు కూడా దాటలేదు. డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీంను పక్కకు పెట్టింది. ఎకనామికల్ సపోర్ట్ స్కీంనూ పట్టించుకోవడం లేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే తప్ప వాటికి కనీస సౌలతులను కల్పించలేదు. ఎస్టీ నివాస ప్రాంతాల్లో గృహ అవసరాలకు నెలకు వంద యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా ఇస్తమని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తండాల నుంచి గ్రామ పంచాయతీలుగా మారిన ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికు నిధులు ఇస్తలేదు. ఇందుకు వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. ఇచ్చింది మాత్రం రూ.150 కోట్లలోపే. అది కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. మైనార్టీ వెల్ఫేర్‌కు రూ.1728 కోట్లు కేటాయించినప్పటికీ షాదీ ముబారక్, రంజాన్ పండుగలకు చేసిన ఖర్చులు, ఇతరత్రా కలిపినా రూ.200 కోట్లు మించలేదు.