న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం 20 ఏండ్లుగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితిని.. 50 ఏండ్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న పలు ప్రతిపాదనల్లో డ్రైవింగ్ లైసెన్స్ గడువు పెంపు కూడా ఒకటి.
అయితే, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ 20 ఏండ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత లైసెన్స్ హోల్డర్ మళ్లీ దరఖాస్తు చేసుకుని.. అవసరమైన పత్రాలు సమర్పించి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పరిమితిని 50 ఏండ్లకు పెంచాలని చూస్తున్నారు. కాగా, లైసెన్స్ రెన్యూవల్స్తగ్గడం వల్ల తమకు వచ్చే ఆదాయం పడిపోతుందేమోనని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
