 
                                    - గతేడాది ఆస్పత్రులపై కేసు నమోదు చేసిన సీఐడీ
- అక్రమాలు నిజమేనని తేలడంతో రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ఇటీవల జీవో
- అయినా యథావిధిగా నడుస్తున్న ఆస్పత్రులు
ఖమ్మం, వెలుగు : పేషెంట్లకు చికిత్స చేయకుండానే, చేసినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసిన వ్యవహారంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 28 ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నుంచి ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు అందాయి. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలు ఆస్పత్రులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆర్డర్ల ప్రకారం ఆయా జిల్లాల్లోనూ ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో సదరు ఆస్పత్రులు యథావిధిగా నడుస్తున్నాయి, పేషెంట్లను చేర్చుకుంటూ ట్రీట్‌మెంట్ చేస్తున్నాయి.
అసలు జరిగిందిదీ !
సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసున్న కొందరు పేషెంట్ల బిల్లులపై అనుమానం రావడంతో 2023 సెప్టెంబర్‌లో సెక్రటేరియెట్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ప్రాథమికంగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగినట్టుగా గుర్తించారు. మొత్తం ఎనిమిది జిల్లాల్లో 28 హాస్పిటల్స్ తప్పుడు పత్రాలు ఇచ్చినట్టు, బిల్లులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చారు. దీంతో ఈ కేసును గతేడాది సీఐడీకి బదిలీ చేయగా, ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి అన్ని ఆస్పత్రుల్లోనూ సీఐడీ అధికారులు ఎంక్వైరీ చేసి, ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
అప్పుడే ఆస్పత్రులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో ఆయా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేషెంట్లు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని సదరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దాచిపెట్టి ఇన్ని రోజులుగా పేషెంట్లను మోసం చేస్తున్నాయి. తాజాగా ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన ఆస్పత్రులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, పర్మిషన్లు రద్దు చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
యథావిధిగా నడుస్తున్న హాస్పిటల్స్
ప్రైవేట్ హాస్పిటల్స్‌కు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇటీవల వచ్చిన ఆదేశాల అమల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్కామ్‌కు పాల్పడిన 10 ఆస్పత్రుల అనుమతులను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినా, అవి మాత్రం యథావిధిగానే నడుస్తున్నాయి. ఈ విషయంపై ఖమ్మం డీఎంహెచ్‌వో కళావతిబాయి వివరణ కోరగా ఆస్పత్రుల పర్మిషన్ రద్దు చేయడంతో పాటు సీజ్ చేస్తున్నట్టుగా ఆదేశాలిచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఇంకా ఆస్పత్రులను నడిపిస్తుండడంపై వారికి నోటీసులు ఇస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆస్పత్రిని బ్లాలిస్ట్‌లో పెట్టి, నోటీసులు ఇచ్చామని అక్కడి అధికారులు చెప్పారు.
పర్మిషన్లు రద్దు అయిన హాస్పిటల్స్
ఆస్పత్రి పేరు                                     జిల్లా 
హిరణ్య హాస్పిటల్, మీర్‌పేట            రంగారెడ్డి
జనని హాస్పిటల్, 
మాదన్నపేట మెయిన్‌రోడ్                హైదరాబాద్
డెల్టా హాస్పిటల్, హస్తినాపురం           రంగారెడ్డి
శ్రీరక్ష హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్    హైదరాబాద్
ఎంఎంఎస్ హాస్పిటల్, ఎల్బీనగర్    హైదరాబాద్
నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 
మిర్యాలగూడ        నల్గొండ
అమ్మ హాస్పిటల్, నల్గొండ                   నల్గొండ
మహేశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 
మిర్యాలగూడ        నల్గొండ
సప్తగిరి హాస్పిటల్, జమ్మికుంట            కరీంనగర్
శ్రీసాయి జనరల్ హాస్పిటల్                   పెద్దపల్లి
అరుణ శ్రీ హాస్పిటల్, ఐఎస్ సదన్        హైదరాబాద్
శ్రీకృష్ణ హాస్పిటల్, సైదాబాద్                హైదరాబాద్ 
ఏడీఆర్ఎం హాస్పిటల్, రామంతాపూర్    హైదరాబాద్
ఎంఎంవీ ఇందిర హాస్పిటల్, కొత్తపేట    రంగారెడ్డి
శ్రీసాయి తిరుమల హాస్పిటల్, 
బైరామల్‌గూడ        హైదరాబాద్
రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్    హన్మకొండ
శ్రీ సంజీవని హాస్పిటల్                   మహబూబాబాద్
గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్    ఖమ్మం
శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్    ఖమ్మం
డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్    ఖమ్మం
శ్రీ వినాయక హాస్పిటల్        ఖమ్మం
శ్రీ సాయి హాస్పిటల్        ఖమ్మం
వైష్ణవి హాస్పిటల్        ఖమ్మం
సుజాత హాస్పిటల్        ఖమ్మం
సిద్ధార్థ హాస్పిటల్                  మహబూబాబాద్
న్యూ అమృత హాస్పిటల్        ఖమ్మం
ఆరెంజ్ హాస్పిటల్        ఖమ్మం
మేఘశ్రీ హాస్పిటల్        ఖమ్మం

 
         
                     
                     
                    