కామారెడ్డి ఘటనలో ..డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

కామారెడ్డి ఘటనలో ..డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
  •     మంత్రి దామోదరతో డాక్టర్స్ అసోసియేషన్ భేటీ
  •     రిపోర్ట్‌‌ వచ్చాక చర్యలు తీసుకుంటామని హామీ

హైదరాబాద్, వెలుగు :  కామారెడ్డి హాస్పిటల్ ఘటనలో డాక్టర్ల తప్పేమీ లేదని, వారి సస్పెన్షన్‌‌ను ఎత్తివేయాలని గవర్నమెంట్‌‌ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. కామారెడ్డి జనరల్ హాస్పిటల్‌‌ ఐసీయూలో శనివారం రాత్రి ఓ పేషెంట్‌‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్​ను సస్పెండ్​ చేస్తూ మెడికల్​ఎడ్యుకేషన్​డైరెక్టర్​త్రివేణి ఆర్డర్స్​జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు సోమవారం డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రితో భేటీ అయ్యారు. డాక్టర్లపై సస్పెన్షన్​ఎత్తివేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నందున రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి సూచించారు. 

సస్పెన్షన్‌‌ను ఎత్తివేస్తామని మంత్రి హామీ ఇచ్చారు

మంత్రితో భేటీ తర్వాత అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డాక్టర్లపై సస్పెన్షన్‌‌ను ఎత్తివేస్తామని మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్ ప్రతినిధి, డాక్టర్ బొంగు రమేశ్‌‌ వెల్లడించారు. ఘటనకు కారణమైన సానిటేషన్‌‌ కాంట్రాక్టర్‌‌‌‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారని ఆయన తెలిపారు. కామారెడ్డి దవాఖానలో సౌకర్యాలు లేవని, డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని

అందువల్లే హాస్పిటల్‌‌లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని సస్పెండైన డాక్టర్ వసంత్‌‌ కుమార్ తెలిపారు. ఎలుకలను కంట్రోల్ చేయడం డాక్టర్ల బాధ్యత కాదని, సానిటేషన్ వాళ్ల బాధ్యత అని ఆయన అన్నారు. ఘటన జరిగిన రోజు తాను డ్యూటీలో లేకపోయినా తనను సస్పెండ్ చేశారని, ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రెండ్రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వసంత్ వెల్లడించారు. 

సస్పెన్షన్ ఎత్తేయకపోతే సమ్మె

పేషెంట్‌‌ను ఎలుకలు కరిస్తే డాక్టర్లను, నర్స్‌‌ను సస్పెండ్ చేయడం విచారకరం. గత ప్రభు త్వం కూడా ఎంజీఎంలో ఇలాంటి ఘటనే జరిగితే, డాక్టర్లను సస్పెండ్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేయడం బాధాకరం. ఎలుకలు, పందులు, కుక్కలు, గాడిదలను కంట్రోల్ చేసే బాధ్యత శానిటేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌ది..

 డాక్టర్లను బలి పశువులను చేస్తున్నారు. కామారెడ్డి ఘటనలో డాక్టర్లు, నర్సుపై సస్పెన్షన్‌‌ను వెంటనే ఎత్తివేయాలి. లేకుంటే ప్రభుత్వ డాక్టర్లతో కలిసి సమ్మె చేస్తాం. ప్రజా ప్రభుత్వంలో డాక్టర్ల మీద దాడులను కూడా అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

– డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, ప్రెసిడెంట్, ఐఎంఏ బంజారాహిల్స్ బ్రాంచ్.