సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు

సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు
  • మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వాకం
  • ఐదు శాఖలకు చెందినదాదాపు 150 మంది హాజరు
  • గెలుపు కోసం అర్ధరాత్రిదాకా వ్యూహాలు
  • బీజేపీ, కాంగ్రెస్ నేతలరాకతో పరార్

సిద్దిపేట, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థివెంకట్రామిరెడ్డికారణంగా ప్రభుత్వ ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన పార్టీ సమావేశానికి ఏకంగా 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. గతంలో సిద్దిపేట కలెక్టర్​గా పనిచేసిన ఆయన పిలవగానే రెవెన్యూ, ఇరిగేషన్, ఐకేపీ, ఈజీఎస్, సెర్ప్ విభాగాలకు చెందిన ఉద్యోగులు వెనుకాముందు ఆలోచించకుండా వెళ్లి,వెంకట్రామిరెడ్డిగెలుపు కోసం అర్ధరాత్రి దాకా చర్చలు, వ్యూహరచనలో మునిగిపోయారు.

విషయం తెలిసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మీడియా ప్రతినిధులతో అక్కడికి చేరుకోగా పరుగందుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో వెంకట్రామిరెడ్డిపై త్రీ టౌన్ పీఎస్​లో కేసు నమోదు చేశారు. పార్టీ మీటింగ్​కు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

ఇన్​టైమ్​లో స్పందించని ఆఫీసర్లు, పోలీసులు

మెదక్ సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన అనుభవం, పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగులను సైతం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటలకు సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్​హాల్​లో స్థానిక బీఆర్ఎస్​ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి గతంలో తనతో కలిసి పనిచేసిన అధికారులు, ఉద్యోగులను మీటింగ్​కు ఆహ్వానించాడు.

చాలా మంది సున్నితంగానే తిరస్కరించగా, రెవెన్యూ, ఇరిగేషన్, ఐకేపీ, ఈజీఎస్, సెర్ప్ కు చెందిన సుమారు150 మంది ఉద్యోగులు హాజరయ్యారు. అక్కడే డిన్నర్ చేసి అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ గెలుపు కోసం వ్యూహాలు రచించారు. తన విజయం కోసం ఉద్యోగులంతా కృషి చేయాలని, ప్రతిఫలంగా భారీగా నజరానాలు ఇస్తానని బీఆర్ఎస్​ క్యాండేట్​ఆఫర్ చేసినట్లు తెలిసింది. అత్యంత రహస్యంగా సమావేశం జరిగినప్పటికీ రాత్రి11.30 గంటలకు విషయం కాస్తా బయటకు లీకైంది. బీజెపీ, కాంగ్రెస్ నేతలు ఫంక్షన్ హాల్​ ముందుకు చేరుకోగా, అక్కడి సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు ఫోన్​ చేయగా, వారు ఆలస్యంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో పాటు ఉద్యోగులు తలో మార్గంలో నేతల కండ్లుగప్పి పరారయ్యారు. ముఖాలకు కర్చీప్​లు కట్టుకొని వచ్చిన పలువురు ఉద్యోగులను బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిలదీయగా వారిని తోసుకుంటూ బైకులపై వెళ్లిపోయారు. పోలీసులు ఆలస్యంగా రావడం వల్లే ఉద్యోగులు తప్పించుకున్నారని నేతలు ఆరోపించారు.

ఈ ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఎంసీసీ(మోడల్ కోడ్​ ఆఫ్ కండక్ట్) టీం సభ్యులు చేరుకొని ఆరా తీశారు. ఈ సందర్బంగా రెడ్డి ఫంక్షన్ హాల్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా దాదాపు 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశమై, చర్చలు సాగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఉద్యోగులపై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

కాగా, బీజెపీ, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. 

ఉద్యోగులకు డబ్బు ఎరగా వేశారు: బీజేపీ, కాంగ్రెస్​

బీజెపీ నేత దినేశ్, కాంగ్రెస్ నేత అత్తు ఇమామ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమయ్యారని చెప్పారు. ఉద్యోగులకు డబ్బు ఎరగా వేసి ఓట్లు వేయించుకోవాలనే కుట్రకు పాల్పడ్డారని ఫైర్ ​అయ్యారు.  

అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఇన్​టైంలో స్పందించలేదని,  ఆలస్యంగా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అందరూ పారిపోయారని ఆరోపించారు.  సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అభ్యర్థితోపాటు సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని దినేశ్, అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు.