సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు  చేస్తారనే భయంతోనే..

సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు  చేస్తారనే భయంతోనే..
  • మీ ఫోన్లను ప్రభుత్వ హ్యాకర్లు వింటున్నరు
  • ఐ ఫోన్​ యూజర్లకు యాపిల్​ కంపెనీ వార్నింగ్​
  • స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు పొంచి ఉన్నరు
  • మీరెవరో, ఏం చేస్తున్నారో తెలిసిన   తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నరు 
  • ఫొటోలు, డేటా అంతా వారి  చేతుల్లోకి పోయే ప్రమాదమున్నది
  • మూడో కంటికి తెలియకుండానే హ్యాక్ చేస్తున్నరు
  • ప్రతిపక్ష లీడర్లు, జర్నలిస్టులు, ప్రముఖులే టార్గెట్
  • రాష్ట్రంలోని పలువురు లీడర్లను అప్రమత్తం 
  • చేస్తూ ఈ మెయిల్స్ పంపిన యాపిల్

హైదరాబాద్, వెలుగు :  ఏదైనా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారా? రైతులు, విద్యార్థులు, వివిధ వర్గాల తరఫున ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారా? ప్రతిపక్షంలో యాక్టివ్​గా ఉంటున్నారా? సోషల్​ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారా? అయితే మీ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లే!! రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు, ఎన్‌‌జీవోల ప్రతినిధులు, వివిధ సంఘాల లీడర్ల ఫోన్లు ట్యాపింగ్‌‌కు గురవుతున్నాయి. మొబైల్ రంగంలో ప్రపంచ దిగ్గజమైన యాపిల్ కంపెనీ స్వయంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు లీడర్లను అప్రమత్తం చేస్తూ ఈ మెయిల్స్ పంపింది. ప్రతిపక్ష లీడర్లు మాత్రమే కాదు.. అధికార పార్టీ నేతలకూ యాపిల్ కంపెనీ హెచ్చరికలు అందాయి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి యాపిల్ కంపెనీ అలాంటి వార్నింగ్ మెయిల్ పంపించింది. ‘‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్.. స్పైవేర్ ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. మీ మాటలతోపాటు.. మీ చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు” అని అప్రమత్తం చేసింది.  ఐఫోన్లు వాడుతున్న ప్రముఖ జర్నలిస్టులు, ఎన్​జీవో ప్రతినిధులకు యాపిల్ కంపెనీ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెయిల్స్ అందుతున్నాయి. తాజా హెచ్చరికలతో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇంతకీ ఫోన్లను ఎవరు హ్యాక్ చేస్తున్నారు? ఇతరుల ప్రైవసీని భంగం కలిగించే రహస్య స్పై వేర్ ఎందుకు ఉపయోగిస్తున్నారనేది ఆందోళన కలిగిస్తోంది.

పెరిగిన ఫిర్యాదులు

మునుగోడు ఉప ఎన్నిక ముందు నుంచీ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన ఫోన్ హ్యాక్ అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు బైపోల్ టైమ్​లో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆందోళనకు దిగారు. పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి పలుమార్లు ఇవే ఆరోపణలు చేశారు. ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు విచారణ సందర్భంగానూ నిందితుల తరఫున రాష్ట్ర హైకోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదనే ప్రస్తావన వచ్చింది. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ ద్వారా వినడానికి అనుమతి లేదని హైకోర్టు స్పందించటం గమనార్హం. రెండు నెలల కిందట బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ఇదే విషయాన్ని బయటపెట్టారు. తన ఫోన్​ను హ్యాక్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

ప్రత్యర్థులపై నిఘా కోసమే?

చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేందుకు ప్రభుత్వమే ఈ ట్యాపింగ్​కు పాల్పడుతున్నదనే వాదనలున్నాయి. ఐఫోన్ ప్రస్తావించిన ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్’​.. అనేది అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. సాధారణంగా క్రిమినల్స్ కదలికలు తెలుసుకునేందుకు ఫోన్లను ట్యాప్ చేయటం, లొకేషన్ ట్రేస్ చేయటంతోపాటు హ్యాకింగ్ చేసే టెక్నాలజీని వాడుతారని ఒక పోలీస్ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే సాఫ్ట్ వేర్‌‌‌‌‌‌‌‌ను రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు, వాళ్ల కదలికలతో పాటు ఆర్థిక వ్యవహారాలను తెలుసుకునేందుకు ప్రభుత్వమే దీన్ని ప్రయోగిస్తున్నదనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పెగాసెస్​తో పాటు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకునే అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టెక్నాలజీతో హ్యాక్ చేసే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక స్పామ్ కాల్ చేసి.. యూజర్ లిఫ్ట్ చేస్తే.. పది సెకన్లలో ఎవరి ఫోన్‌‌‌‌లోనైనా స్పైవేర్ ప్రయోగించే హ్యాకింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉందని హెచ్చరిస్తునారు. తాజాగా యాపిల్ కంపెనీ పంపించిన మెయిల్స్​లో హ్యాకింగ్ ఎలా జరుగుతుందనే వివరాలు కూడా ప్రస్తావించటం గమనార్హం.

యాపిల్ సూచనలివీ

ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసినా.. ఆయా కంపెనీల నుంచి హెచ్చరించే సందేశాలు అందవు. కానీ అత్యాధునిక పరిజ్ఞానం, హై సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న యాపిల్ కంపెనీ తన యూజర్లు హ్యాకర్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు సాఫ్ట్​వేర్ అప్​డేట్ చేస్తుంది. అందులో భాగంగానే యూజర్లను అలర్ట్ చేసేందు కు వార్నింగ్ మెయిల్స్ పంపిస్తుంది. హ్యాకింగ్ ముప్పు నుంచి బయటపడేందు కు యూజర్లకు యాపిల్ కొన్ని సూచనలు చేసింది. మెసేజింగ్, క్లౌడ్ యాప్​లను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్లకు అప్​డేట్ చేసుకో వాలని, కొత్త వెర్షన్లలో సెక్యూరిటీ అప్​డేట్ ఫీచర్లు ఉంటాయని వివరించింది. ఎవరైనా అనధికార వ్యక్తులు లేదా అన్​ఎక్స్​పెక్టెడ్ యూజర్ల నుంచి లింకులు వస్తే క్లిక్ చేయకుండా వదిలేస్తే మంచిదని తెలిపింది. వీలైతే హ్యాకింగ్ నుంచి బయట పడేందుకు ఎక్స్​పర్ట్స్​ను సంప్రదించాలని సూచించింది. ఎక్స్​పర్ట్​ను కలవలేక పోతే.. ముందు జాగ్రత్త చర్యగా కనీసం పాస్​వర్డ్​లు మార్చుకోవాలని చెప్పింది.

సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు  చేస్తారనే భయంతోనే..

రాష్ట్ర ప్రభుత్వానికి అభద్రతాభావం ఉంది. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకు లతోపాటు ప్రతిపక్షాల నేతలు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తోంది. నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నది. దీనిపై యాపిల్ కంపెనీ నుంచి గతంలోనే అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఘోరమైన నేరం. తప్పు. కానీ వాళ్లు ఇది చేస్తున్నట్లు ఎక్కడా రికార్డుల మీద ఉండదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయంతోనే వాళ్ల ఫోన్లను సర్కారు వింటున్నది. ప్రతిపక్ష నేతల వ్యూహాలు, పార్టీల అంతర్గత విషయాలను కూడా తెలుసుకుంటుంది. ఇది పూర్తిగా ఇల్లీగల్.

‑ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

ఎట్ల హ్యాక్ చేస్తున్నరు?

హ్యాకర్లు అధునాతనమైన సాఫ్ట్‌‌వేర్ వాడుతారు. యాపిల్‌‌కు సంబంధంలేని చానళ్లు, డివైజ్‌‌లు, అకౌంట్ల నుంచి హ్యాకింగ్‌‌కు పాల్పడుతారు. టెక్నాలజీకి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్​డేట్ చేసుకుంటున్నరు. మూడో కంటికి తెలియకుండా.. ఫోన్ ఓనర్స్ కూడా పసిగట్టే అవకాశం ఇవ్వకుండా సిస్టమ్‌‌లోకి చొరబడి డేటా తీసుకుంటారు. అంతేకాదు ప్రమాదకరమైన లింకులను పంపించి.. యూజర్‌‌‌‌ను దానిపై క్లిక్ చేసేలా చేసి హ్యాకింగ్​కు పాల్పడుతారు. నోటిఫికేషన్ మెసేజ్, ఈ మెయిల్, మెసేజ్, వాట్సాప్ చాట్‌‌లను లింకులు పంపించేందుకు వాడుకుంటారు. యూజర్ కన్విన్స్ అయ్యే సమాచారాన్నే లింకులుగా ఫార్వర్డ్ చేస్తారు. ఉదాహరణకు.. ఓ కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగాలేదని, డబ్బులు కొంచెం సర్దుబాటు చెయ్యండనో.. ఫేక్ అప్​డేట్‌‌లను సెండ్ చేయడం ద్వారానో హ్యాకింగ్‌‌కు దిగుతారని యాపిల్ హెచ్చరించింది.

ప్రతిపక్ష నేతల ఫోన్లపై  సర్కారు నిఘా

ప్రతిపక్ష నేతల ఫోన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఐదేండ్లుగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నది. ఇందుకోసం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసి పెగాసెస్ స్పైవేర్ వంటి సాఫ్ట్‌‌వేర్​లను కొనుగోలు చేసిందనే అనుమానాలున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని హెచ్చరిస్తూ యాపిల్ సంస్థ ఈ మెయిల్స్ పంపుతుండటం ఇందుకు బలాన్నిస్తున్నది. ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా సర్కారు వ్యవహరిస్తూ నేతల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌‌పై విచారణ చేపట్టాలి.

- వివేక్ వెంకటస్వామి,  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ఇదీ యాపిల్ హెచ్చరిక

‘‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ యాపిల్ ఐడీ ఆధారంగా మీ ఫోన్‌‌ను రిమోట్ ద్వారా వారి కంట్రోల్‌‌లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా మీరెవరో, మీరు ఏం చేస్తున్నారో తెలిసిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ ఐఫోన్ కంట్రోల్ వారి చేతుల్లోకి పోయే అవకాశమున్నది. ఫోన్‌‌లోని కెమెరా, మైక్రోఫోన్, స్టోరేజీ డేటా, కాంటాక్టులు, కమ్యూనికేషన్ వివరాలన్నీ రిమోట్‌‌తో వారు ఆపరేట్ చేసే ప్రమాదమున్నది. దీన్ని ‘ఫాల్స్ అలారం’గా భావించొద్దు. సీరియస్‌‌గా తీసుకోండి. ఇప్పటికే మీకు ‘త్రెట్ మెసేజ్’ వచ్చి ఉంటే.. మళ్లీ అదే ప్రయత్నం జరుగుతున్నదని భావించండి’’ అంటూ ఈ-మెయిల్ మెసేజ్‌‌ ద్వారా యాపిల్ కంపెనీ అలర్ట్ చేస్తున్నది.