SBI Fraud Alert: ఎస్బీఐ కస్టమర్లూ.. ఆ రూ.16,870 కోసం కక్కుర్తి పడకండి..

SBI Fraud Alert: ఎస్బీఐ కస్టమర్లూ.. ఆ రూ.16,870 కోసం కక్కుర్తి పడకండి..

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. బ్యాంకు అకౌంట్లలో డబ్బే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా.. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులపై ఒక మాయ వల విసిరారు. ఆ వలలో పడ్డారంటే బ్యాంకు ఖాతాలో డబ్బును క్షణాల్లో హాంఫట్ చేసేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.

ఎస్బీఐ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవాలంటే ఈ పని చేయండని ఎస్బీఐ పంపినట్లుగా సైబర్ నేరగాళ్లు ఒక APK File లింక్ను కస్టమర్లకు పంపుతున్నారు. ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చిందనుకుని రివార్డు పాయింట్ల కోసం ఆ లింక్ క్లిక్ చేసిన కస్టమర్ల ఖాతాల్లో డబ్బును సైబర్ కేటుగాళ్లు మాయం చేసేస్తున్నారు. 

మరీ ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. రూ.16,870 విలువైన ఎస్ బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్స్ నేటితో ఎక్స్పైరీ అయిపోతున్నాయని.. ఎస్ బీఐ రివార్డ్ యాప్ ద్వారా తక్షణమే ఆ రివార్డ్ పాయింట్స్ పొంది.. రివార్డ్ పాయింట్స్ ద్వారా వచ్చిన ఆ డబ్బును ఖాతాలో క్రెడిట్ చేసుకోండని మెసేజ్ పంపిస్తున్నారు. ఆ మెసేజ్ లోనే ఒక APK File లింక్ పంపుతున్నారు. ఆశపడి ఆ లింక్ను క్లిక్ చేశారా.. అంతే సంగతులు.

 

సో.. ఈ మెసేజ్ ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో తేలింది. ఎస్బీఐ ఇలాంటి లింక్ ఏం పంపలేదని తేల్చింది. ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు తొందరపడి క్లిక్ చేయకండి. వ్యక్తిగత వివరాలు అడిగితే పొరపాటున కూడా ఎంటర్ చేయడం గానీ, కాల్ చేసి ఎవరైనా అడిగినప్పుడు చెప్పడం గానీ చేయకండి. ఆన్ లైన్ ట్రాన్షాక్షన్స్ కోసం అఫిషియల్ బ్యాంకింగ్ యాప్స్, వెబ్సైట్స్ మాత్రమే వినియోగించండి. థర్డ్ పార్టీ యాప్స్ వాడి చిక్కుల్లో పడకండి.