గణపసముద్రం, కోటగుళ్లకు కొత్తరూపు..టూరిజం కేంద్రాలుగా మారనున్న ప్రాంతాలు

గణపసముద్రం, కోటగుళ్లకు కొత్తరూపు..టూరిజం కేంద్రాలుగా మారనున్న ప్రాంతాలు
  • రూ.14.35 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టిన ప్రభుత్వం 
  • గణపసముద్రంపై రెడీ అవుతున్న కాటేజీలు, బోటింగ్ పాయింట్
  • వానకాలం నాటికి పూర్తయ్యేలా కొనసాగుతున్న పనులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన కోటగుళ్లు, గణపసముద్రంను టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కార్​ ఫోకస్​ పెట్టింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయ రాజులు నిర్మించిన ఆయా ప్రాంతాలను టూరిజం స్పాట్స్​గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పర్యాటకశాఖ ఆయా పనులను స్పీడప్ చేసింది. అద్భుతమైన చారిత్రక శిల్ప సంపదను రక్షించి బావితరాలకు అందించడంతో పర్యాటకులను ఆకర్షించేలా పనులు ముమ్మరం చేశారు. వందల ఏండ్లుగా నిరాదరణకు గురైన కోటగుళ్లను తెలంగాణ ప్రభుత్వం టూరిజం స్పాట్ లా మారుస్తుండటంతో సర్కారుకు ఆదాయం రావడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

పర్యాటకులను ఆకర్షించేలా..

దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఆధ్యాత్మిక వేడుకగా కోటగుళ్లను మార్చేలా పర్యాటక శాఖ ఆఫీసర్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఎంతో చరిత్ర ఉన్నది. ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు కాకతీయుల కళానైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి. జర్మనీ, జపాన్, అమెరికా లాంటి దేశాలకు చెందిన పర్యాటకుల తాకిడి కోటగుళ్లకు చాలా ఏండ్లుగా ఉంది. ఈ క్రమంలోనే కోటగుళ్లను సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా దృష్టి సారించి పనులు షురూ చేశారు. పర్యాటక సర్య్కూట్ లో కోటగుళ్లను చేర్చేలా టూరిజం ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. మేడారం, రామప్ప వెళ్లే పర్యాటకులు కోటగుళ్లను సందర్శిస్తుంటారు. పర్యాటకులు ఇక్కడే బస చేసేలా రెస్టారెంట్, కాటేజీల నిర్మాణాలపై దృష్టి సారించి శరవేగంగా పనులు చేపడుతున్నారు. 

రూ.14.35 కోట్లతో పనులు..

పర్యాటక శాఖ సాస్కీ, యాట్ స్కీం ద్వారా రూ.14.35 కోట్లతో కోటగుళ్లు, గణసముద్రం వద్ద పర్యాటకుల కోసం చేపట్టిన నిర్మాణాలు స్పీడప్ చేశారు. గణసముద్రం వద్ద 6 కాటేజీలు స్లాబ్ నిర్మాణం పూర్తికాగా, ప్రహరీ ఏర్పాటు చేస్తున్నారు. రెస్టారెంట్ నిర్మాణాలకు ఫిలర్లు ప్రారంభించారు. గణపసముద్రంలో బోటింగ్ చేసే పాయింట్ వద్ద కట్ట నుంచి చెరువులోకి వెళ్లే విధంగా చదును చేశారు. వాక్ పాత్, లెక్ వ్యూ పాయింట్ నిర్మాణాలు పునాదుల్లో ఉన్నాయి. కట్టపై సీటింగ్ బెంచీల ఏర్పాటుతో పాటు గార్డెనింగ్ చేయనున్నారు.

కోటగుళ్ల వద్ద సీసీ నిర్మాణం, పార్కింగ్ ఏరియా కంప్లీట్ చేశారు. అతిథి గృహ మరమ్మతులు జరుగుతున్నాయి. ఆలయ పరిసరాల్లో చిల్ర్డన్ పార్క్ తో పాటు ప్లే ఏరియా, గార్డెనింగ్, మూడు మండపాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వానకాలం నాటికి పనులు పూర్తి చేసి కాటేజీలు, బోటింగ్, రెస్టారెంట్, లేక్ వ్యూ పాయింట్ ప్రారంభించే విధంగా పనులు స్పీడప్​ చేశారు. డీజీపీఏస్ (డిజిటల్ గ్లోబింగ్ పోజిషన్ సర్వే) ద్వారా ఫిల్లర్ల కాలం మార్కింగ్ చేపడుతున్నారు. కట్టపై నిర్మాణాలు జరుగుతుండటంతో ఫిల్లర్ల పాయింట్ ఖచ్చితంగా ఉండేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, శిథిలిమైన శిల్పాల పునరుద్ధరణ, కాకతీయుల శిల్ప కళను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటుకు రూ.30 కోట్లతో పర్యాటక శాఖ డీపీఆర్ సిద్ధం చేసింది. 

పనులు స్పీడప్ చేశాం.. 

కోటగుళ్లు, గణపసముద్రం వద్ద టూరిజం ద్వారా చేపడుతున్న పనులను స్పీడప్ చేశాం. వానా కాలం నాటికి పనులు పూర్తయ్యేలా ప్లానింగ్ చేశాం. పార్కింగ్ ఏరియా కంప్లీట్ చేశాం. ఆలయ పరిసరాల్లో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. పర్యాటకులను ఆకర్షించేలా పనులు చేపడుతున్నాం. టూరిజం ద్వారా చేపట్టే పనులు వందల ఏళ్లపాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  - కీర్తికుమార్, టూరిజం ఏఈ