కొన్ని స్కీమ్​లకు పైసా కూడా రిలీజ్​ చేయని సర్కార్

కొన్ని స్కీమ్​లకు పైసా కూడా రిలీజ్​ చేయని సర్కార్

హైదరాబాద్​, వెలుగు: గత బడ్జెట్​లో పెట్టిన కొన్ని  స్కీములకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయడంలేదు. కొన్నింటికి భారీ కేటాయింపులు చేసినట్లు చూపించి.. అత్తెసరు నిధులతోనే ఏడాది గడిపేసింది. సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, 57 ఏండ్లు దాటినోళ్లకు ఆసరా పెన్షన్​, గొర్రెల పంపిణీ, సమగ్ర భూసర్వే, మూసీ ప్రక్షాళన.. ఇట్లా పలు స్కీములను పెండింగ్​ జాబితాలో పడేసింది.  అంతకుముందు ఏడాది 2020–21​ బడ్జెట్​లో పెట్టిన నిరుద్యోగ భృతి స్కీమ్​కు ఇప్పటివరకు అతీగతీ లేదు. అప్పుడు నిరుద్యోగ భృతి కోసం రూ.5 వేల కోట్లు బడ్జెట్​లో పెట్టిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్​లను స్టడీ చేసే బాధ్యతలను ఆఫీసర్లకు అప్పగించి చేతులు దులుపుకుంది. తర్వాత 2021–22 బడ్జెట్​లో నిరుద్యోగ భృతి మాట కూడా లేకుండా దాచేసింది. 

భూ సర్వే: ప్రాసెస్​ కూడా స్టార్ట్​ కాలే 

బడ్జెట్  కీలక పాయింట్లలో ఒకటిగా  చెప్పుకున్న సమగ్ర భూసర్వే ఇప్పటికీ మొదలు కాలేదు. రూ.400 కోట్లతో చేపడుతామన్న ఈ సర్వేకు సంబంధించి ప్రభుత్వం కనీసం ప్రాసెస్​ కూడా స్టార్ట్​ చేయలేదు. ‘ధరణి’లో ఉన్న లోపాలు ఇప్పటికే రాష్ట్రంలో రైతుల పాలిట శాపంగా మారాయి. సర్వే కూడా ముందుకు సాగకపోవటంతో భూ వివాదాల పరిష్కారం గాల్లో దీపంగా మారింది. 

కొత్త ఆసరా పెన్షన్లు: అప్లికేషన్లకే పరిమితం

మూడేండ్లుగా చెప్తున్న కొత్త ఆసరా పెన్షన్ల  పంపిణీ అప్లికేషన్ల దగ్గర్నే ఆగిపోయింది. గత బడ్జెట్​లో రూ. 11,728 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. మూడు దఫాలుగా అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది.  దాదాపు 14 లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారు. ఇప్పటికీ వాటి వెరిఫికేషన్‌‌ స్టార్ట్‌‌ చేయలేదు. దీంతో కొత్త పెన్షన్ల మంజూరు పెండింగ్​లో పడిపోయింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లోన్లు: ఇచ్చుడే లేదాయె

గత బడ్జెట్​లో బీసీ కార్పొరేషన్‌‌కు రూ. 500 కోట్లు పెట్టారు. కానీ ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందిస్తున్నా సర్కారు మాత్రం ఆమోదించడంలేదు. ఇట్ల నాలుగేండ్లుగా ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వడంలేదు. 2021–22  బడ్జెట్​లో ఎంబీసీ కార్పొరేషన్‌‌కు రూ. 500 కోట్లు కేటాయించారు.  గతంలో అప్లికేషన్లు తీసుకున్న 15 మంది ఎంబీసీలకు ఎలక్ట్రిక్‌‌ ఆటోలు ఇచ్చారు. అంతకు మించి నిధులు ఖర్చు చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్‌‌ పరిధిలో ఎకనమిక్‌‌ సపోర్ట్‌‌ స్కీం(లోన్స్‌‌)కు గత బడ్జెట్​లో రూ.1,784 కోట్లు పెట్టినా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంతకుముందు బడ్జెట్‌‌లో పెట్టిన నిధుల కోసం తీసుకున్న అప్లికేషన్లే ఇంకా పెండింగ్‌‌లో మూలుగుతున్నాయి.  ట్రైకార్‌‌ (ఎస్టీ కార్పొరేషన్‌‌)కు 2021–22 బడ్జెట్​లో రూ. 428 కోట్లు పెట్టారు. లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న దాదాపు ఎనిమిది లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

రోడ్ల రిపేర్లు: సగం నిధులన్నా రాలే

స్టేట్ రోడ్స్​ రిపేర్లకు గత బడ్జెట్​లో ప్రభుత్వం రూ.800 కోట్లు పెట్టగా, వీటిలో సగం నిధులు కూడా రిలీజ్‌‌ చేయలేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.750 కోట్లు కేటాయించారు. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. మూసీ పునరుజ్జీవం, పరిసరాల సుందరీకరణ కోసం రూ. 200 కోట్లు అలకేట్ చేసినా.. ఒక్క రూపాయి రిలీజ్‌‌ చేయలేదు. జిల్లా పరిషత్​, మండల పరిషత్​లకు బడ్జెట్​లో రూ. 500 కోట్లు అలకేట్‌‌ చేసినా..  ఇందులో సగం మాత్రమే రిలీజ్​ చేశారు.

బైపోల్​ ఉన్న చోటనే గొర్రెల పంపిణీ, వడ్డీ లేని రుణాలు

డ్వాక్రా స్కీమ్​లో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలు చెల్లించేందుకు 2021–-22 బడ్జెట్​లో రూ.3 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. నిరుడు జులైలో కేవలం రూ. 200 కోట్లు ఇచ్చింది. అందులో ఎక్కువ నిధులు బై ఎలక్షన్​ జరిగిన హుజూరాబాద్​ నియోజకవర్గానికి ఖర్చు పెట్టింది. మహిళా సంఘాలతో ఫుడ్​ ప్రాసెసింగ్​ చేయిస్తామని బడ్జెట్​లో చెప్పిన మాటలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. గొర్రెల పంపిణీ కోసం బడ్జెట్‌‌లో రూ.3 వేల కోట్లతో మూడు లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని  ప్రకటించింది. కానీ, బై ఎలక్షన్​ జరిగిన నాగార్జున సాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోనే కొందరికి గొర్రెలు పంపిణీ చేసి.. పక్కనపడేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 28వేల మంది గొల్లకురుమలు ఈ స్కీమ్​ కోసం డీడీలు కట్టి యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

డబుల్​ బెడ్రూం ఇండ్లు అంతంతే

డబుల్ బెడ్రూం ఇండ్లకు 2021–22 బడ్జెట్​లో రూ.11 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభు త్వం..అందులో 15 శాతం నిధులు కూడా విడు దల చేయలేదు. సొంతింటి స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామనే హామీ పత్తా లేకుండా పోయింది.

బృహత్తర విద్యా పథకం: నయా పైసా రాలే

గత బడ్జెట్​లో బృహత్తర విద్యా పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నయా పైసా రిలీజ్‌ చేయలేదు. కొత్త బడ్జెట్​ దగ్గర పడుతుండటంతో ‘మన ఊరు.. మన బడి’ అంటూ హడావుడి మొదలు పెట్టింది.

రైతు రుణమాఫీ: సా....గుతున్నది

గత బడ్జెట్‌లో రైతు రుణ మాఫీకి రూ. 5,225 కోట్లు అలకేట్‌ చేశారు. అందులో నుంచి రూ.230 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మూడేండ్ల నుంచి రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులు.. మాఫీ కాక తిప్పలుపడుతున్నారు. వడ్డీల భారంతో రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా​40.66 లక్షల రైతులుంటే.. మూడేండ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది అప్పు తీరలేదు.