
- పత్తాలేని మూడెకరాల భూమి..
- మూడేండ్ల నుంచి సబ్సిడీ లోన్లు బంద్
- కాగితాలపైనే ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్
- 2018లో ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల స్కీంకు అతీగతీ లేదు
- ఇప్పుడు ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’స్కీం పేరుతో హడావుడి
- 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం, 15 అంతస్తుల టవర్ జాడే లేదు
- ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తలే
- ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇస్తలే
హైదరాబాద్, వెలుగు: కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో దళితులకు ఒరిగిందేమీ లేదు. బతుకులు మారుతాయని, బాగుపడుతామని ఆశించిన ఎస్సీలకు నిరాశే ఎదురవుతోంది. మూడెకరాల భూమి, సబ్సిడీ లోన్లు, డెవలప్‌మెంట్ నిధులు, కొలువులు.. ఇట్ల సర్కారు పెద్దలు ఇచ్చిన హామీలన్నీ పత్తా లేకుండా పోయాయి. హుస్సేన్‌సాగర్ వద్ద 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం, లోయర్ ట్యాంక్ బండ్‌లో హైటెక్ హంగులతో 15 అంతస్తుల అంబేద్కర్ టవర్ అంటూ చెప్పిన ముచ్చట్లు ఊసులో లేకుండా పోయాయి. 2018లో ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల ‘చీఫ్ మినిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ స్కీంను మూలకుపడేసి.. ఇప్పుడు ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ స్కీం పేరుతో హడావుడి చేస్తున్నారు. పథకాలకు పేరు మార్చడం తప్ప వాటిని, నిధులను తమకు ఉపయోగించడం లేదని, తమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని దళితులు మండిపడుతున్నారు. మూడేండ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందడం లేదు.కులాంతర వివాహం చేసుకున్నవారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారెజ్ ఇన్సెంటివ్స్ ఇస్తలేరు. ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను బడ్జెట్ కేటాయింపుల్లో చూపిస్తున్నారు తప్ప.. వాటిని ఖర్చు చేసేది అంతంతే. పైగా ఇతర పథకాలకు డైవర్ట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సబ్సిడీ లోన్లు: మూడేండ్ల నుంచి బంద్
దళిత నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు అందడంలేదు. 2018 ఎన్నికల ముందు వరకు లోన్లు మంజూరు చేసి, ఆ తర్వాత నుంచి బంద్ పెట్టారు. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించలేదు. అయినా లోన్లు ఇచ్చామని ఎస్సీ అభివృద్ధి శాఖ మాత్రం ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటి దాకా మొత్తం 5.3 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. 1.16 లక్షల మందికి మాత్రమే లోన్లు మంజూరు చేశారు. ఇటీవల 1.8 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మే 31 వరకు లోన్లు మంజూరు చేయాల్సి ఉన్నా ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది.
ఎస్సీ ఎస్డీఎఫ్: కేటాయింపుల్లోనే మస్తు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్)/సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ పద్దులో మస్తుగా ఇస్తున్నట్లు చూపిస్తున్నా వాస్తవ రూపంలో సగం కూడా ఖర్చు చేస్తలేరు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. తెలంగాణ వచ్చిప్పటి నుంచి బడ్జెట్‌లలో ఎస్సీ ఎస్డీఎఫ్‌కు రూ. 86,013 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది చివరి నాటికి రూ. 50,884 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేటాయింపులు, ఖర్చుల్లో తేడా సుమారు రూ. 35 వేల కోట్లకు పైగా ఉంది. అయితే నిధులు ఖర్చు చేయకపోతే మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ చేయాలని చట్టంలో ఉన్నా అదీ అమలైతలేదు. నిధులను ఇతర డిపార్ట్‌మెంట్లకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి స్టేట్ లెవెల్ కమిటీ, విజిలెన్స్, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం లేదు.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీం: ఎటుపాయె?
రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎస్సీలకు రూ. వెయ్యి కోట్లతో పథకం తీసుకొచ్చి అమలు చేయకుండా చేతులు దులుపుకొంది. 2018--–19 ఆర్థిక సంవత్సరంలో ‘చీఫ్ మినిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ పేరుతో స్కీంను ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 2018 ఆగస్టు 29న జీవో నంబర్ 39 విడుదల చేశారు. ఇందులో భాగంగా రూ. 5 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 50 లక్షలు సబ్సిడీతో బ్యాంకు లింకేజీ లోన్ ఇస్తామని ప్రత్యేకంగా పొందుపర్చారు. కానీ ఇప్పటి దాకా ఒక్కరికీ లబ్ధి చేకూర్చలేదు. ఇదే పథకాన్ని పేరు మార్చి కొత్తగా ఇప్పుడు ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ అని తీసుకొచ్చారని, పాతదే పత్తాలేదని, మళ్లీ కొత్తది తీసుకొచ్చి మభ్యపెడుతున్నారని ఎస్సీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్స్: ఇస్తలేరు
ఎస్సీలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్‌ను సర్కారు ఇస్తలేదు. 20 నెలలుగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ. 2.50 లక్షల ఇన్సెంటివ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ల కోసం దాదాపు 1,800 మంది ఎస్సీలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇన్సెంటివ్స్ వస్తలేవని ఎస్సీ సంఘాలు మండిపడుతున్నాయి.
అట్రాసిటీ యాక్ట్: సరిగ్గా అమలైతలేదు
రాష్ట్రంలో ఎస్సీలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 8,912 ఎట్రాసిటీ కేసులు రికార్డయ్యాయి. 2017లో 1,466 దాడులు, 2018లో 1,507 దాడులు, 2019లో 1,690 దాడులు జరిగాయి. ఇంకా ఎఫ్‌ఐఆర్ ఫైల్ కానివి అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పకడ్బందీగా అమలు కాకపోవడంతో 25శాతం మంది ఎస్సీ, ఎస్టీల రక్షణ గాలిలో దీపంలా మారింది. ఏడేండ్లు దాటినా సీఎం చైర్మన్‌గా హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు. యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ 2016లో ఎస్సీ శాఖ మంత్రి చైర్మన్‌గా అడ్‌హాక్ కమిటీని నియమించారు. జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే మీటింగ్‌లు కొనసాగిస్తున్నారు. మరో వైపు ఎస్సీ, ఎస్టీ బాధితులకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అడిషనల్ రిలీఫ్ సాయం సరిగా అందడంలేదు. ఎస్సీ, ఎస్టీ కేసులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారం కోసం కోర్టుల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తామన్నా రాష్ట్ర సర్కారు చొరవ చూపడంలేదు.
బ్యాక్‌లాగ్ పోస్టులు: నింపుతలేరు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తలేరు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదుల సంఖ్యలోనే పోస్టులను నింపారు. వేల సంఖ్యలో పోస్టులన్నీ ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెడుతూ వస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నామమాత్రంగా రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ జీవో రిలీజ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈసారి ఆ జీవో కూడా రిలీజ్ చేయడం లేదు. ఒక్క హెచ్‌వోడీల్లోనే 7వేల దాకా బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. జిల్లాల్లో 8 వేల వరకు ఖాళీగా ఉన్నాయి.
విగ్రహం, టవర్: ముగ్గుపోసి వదిలేసిన్రు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పీఠం నిర్మాణానికి రాజస్థాన్‌లోని దోల్‌పూర్‌కు చెందిన శాండ్‌స్టోన్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం అనుకుంది. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు. విగ్రహానికి 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడి ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని టీం సిక్కిం రాష్ట్రంలో, చైనాలో పర్యటించింది. అక్కడ విగ్రహాలను స్టడీ చేసి వచ్చింది. అంతే..! అప్పటి నుంచి పట్టించుకునే దిక్కు లేదు. ముగ్గుపోసి ఐదేండ్లు దాటినా తట్టెడు మట్టి తీయలేదు. ఇక అదే రోజు లోయర్ ట్యాంక్ బండ్‌లో హైటెక్ హంగులతో 15అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మించేందుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పెట్టాలని భావించారు. ఆ పనులు కూడా శంకుస్థాపన అయిపోగానే మూలకు పడ్డాయి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
మూడెకరాల భూ పంపిణీని అటకెక్కించిన్రు. 3 లక్షల మందికి ఇస్తమని హామీ ఇచ్చి.. 7 వేల మందికి కూడా ఇయ్యలే. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఓ దళితుడు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలే. ఎస్సీలకు ఇవ్వడానికి భూమి దొరకడం లేదని సర్కారు చెప్తున్నది. మరి ప్రాజెక్టులు, పరిశ్రమలకు లక్షలాది ఎకరాలు ఎట్ల దొరుకుతున్నయ్? కార్పొరేషన్ రుణాలూ బంద్ చేసిన్రు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు.
- పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్,
జాతీయ కార్యదర్శి
హుజూరాబాద్ కోసమే హడావుడి?
హుజూరాబాద్ బై పోల్‌లో లబ్ధి కోసమే ఇప్పుడు ఎస్సీల అభివృద్ధి గుర్తుకువచ్చినట్లు సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు ఎస్సీలదే. ఇక్కడ మొత్తం 2,26,553 ఓటర్లు ఉండగా.. అందులో 45 వేలకుపైగా ఎస్సీల ఓట్లు ఉన్నాయి. దాదాపు ఇరవై శాతం వాటా ఎస్సీ ఓటర్లదే. అందుకే అక్కడి ఎస్సీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీలకు ఏదో ఇచ్చినట్లు ఏడేండ్లుగా కాగితాలపై లెక్కలు చూపించిన ప్రభుత్వం.. ఇప్పుడు అదే స్కీమ్‌లను దళిత్ ఎంపవర్మెంట్ పేరుతో రివ్యూ చేసి, మళ్లీ కొత్త భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
‘మూడెకరాల భూమి’..3% మందికి కూడా ఇయ్యలే
మూడు లక్షల మందికి మూడెకరాల చొప్పున భూమిని ఇస్తామని చెప్పిన సర్కారు.. అందులో కనీసం 3 శాతం కూడా పంచలేదు. ఈ స్కీంను 2014 ఆగస్టు 15న తెచ్చినా ఇప్పటిదాకా రాష్ట్రంలో 6,890 మందికి 16,418.17 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇందులోనూ వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ చేయించకపోవడం, చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంలాంటి సమస్యలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో ఒక్క ఎస్సీకి కూడా భూ పంపిణీ జరగలేదు. 13 జిల్లాల్లో వందలోపు మందికి మాత్రమే భూమి ఇచ్చారు. భూములు ఇవ్వడం అటుంచితే.. దళితుల దగ్గర ఉన్న భూములను కూడా సర్కారు గుంజుకుంటోంది.
భూమి ఇస్తరో లేదో
మా ఊర్లె నాతోపాటు 12 మందిని మూడెకరాల భూ పంపిణీకి అర్హులుగా 2016లో తీర్మానం చేసిన్రు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి దాకా భూమి ఇయ్యలే. ఎవరికి చెప్పినా ఫాయిదా లేదు. ఆఖరికి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సర్కారు ఇస్తదో లేదో కూడా తెలుస్తలేదు.
- రేణుక, హబ్షీపూర్, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా