
గవర్నమెంట్ హాస్పిటళ్లు, లేదా గవర్నమెంట్ గుర్తింపు పొందిన ఏ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ క్లెయిమ్‌లను చెల్లించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి హాస్పిటళ్లకూ కాష్‌లెస్ (నగదు రహిత) సదుపాయాన్ని అందించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఎంతో మందికి ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే, ఇప్పటిదాకా తమ వద్ద నమోదు చేసుకున్న హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్ తీసుకుంటేనే క్లెయిమ్‌లు చెల్లిస్తామని ఇన్సూరెన్స్ కంపెనీలు, థర్డ్–పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (టీపీఏలు) చెబుతున్నారు. అంతేకాదు, కాష్‌లెస్ సదుపాయాన్ని ఏ హాస్పిటళ్లు ఇవ్వాలనేది కూడా వారే నిర్ణయిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ఇంటరిమ్ ఆర్డరును చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని బెంచ్ మే 31 న జారీ చేసింది. కాష్‌లెస్ సహా మెడికల్ ఇన్సూరెన్స్ పొందేందుకు చెల్లుబాటయ్యే పాలసీ ఉన్న అందరు పేషెంట్లూ అర్హులేనని కోర్టు తెలిపింది. హాస్పిటళ్లు తమ వద్ద రిజిస్ట్రేషన్ పొందాలని జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టర్ అసోసియేషన్ (జీఐపీఎస్‌ఏ), పబ్లిక్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల గ్రూప్ వత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. కంటి చికిత్స కోసం దాఖలైన ఈ కేసుకు మాత్రమే ప్రస్తుత ఉత్తర్వులు పరిమితమని చెబుతూనే, జీఐపీఎస్‌ఏ గైడ్‌లైన్స్ సమంజసమైనవి కాదని పేర్కొంది. నెట్‌వర్క్ హాస్పిటళ్ల నుంచి గవర్నమెంట్ హాస్పిటళ్లను మినహాయించడం సమ్మతం కాదని తెలపింది. ఫలితంగా ఇతర ట్రీట్‌మెంట్స్‌కూ ఈ ఆర్డరు వర్తింపచేయాలని సూచించింది. జీఐపీఎస్‌ఏ వద్ద ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ పొందకపోయినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న హాస్పిటళ్లకూ కాష్‌లెస్ సదుపాయాన్ని కల్పించాలని కోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్, టీపీఏ నెట్‌వర్క్స్‌లో రిజిస్ట్రేషన్ పొందాలంటూ నిర్దేశించే గైడ్‌లైన్స్ చట్టబద్దం కాదని, ఎందుకంటే, రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల వద్ద రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరని పిటిషినర్లు వాదించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, టీపీఏలు మాఫియాగా మారి వేధిస్తున్నా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ పట్టించుకోవడం లేదని, హెల్త్‌కేర్ రంగంలో ఇన్సూరెన్స్ కంపెనీలు, టీపీఏల ఆగడాలకు అడ్డూ, ఆపూ ఉండటం లేదని కూడా పిటిషనర్లు వాపోయారు.