జీపీఎఫ్ లోన్లు మంజూరైనా పైసలిస్తలే..107 కోట్ల బకాయిలు

జీపీఎఫ్ లోన్లు  మంజూరైనా పైసలిస్తలే..107 కోట్ల బకాయిలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు ఆలస్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. వాళ్లు దాచుకున్న డబ్బులిచ్చేందుకు కూడా తిప్పలు పెడ్తోంది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), పార్ట్ ఫైనల్ డబ్బులనూ నెలల తరబడి ఇవ్వకుండా ఆపుతోంది. ఏకంగా 10 నెలల నుంచి ఏడాదిదాకా పెండింగ్​లో పెడుతోంది. దీంతో అత్యవసర సమయంలో ఉపయోగపడతాయని అనుకున్న డబ్బులు సకాలంలో రాక టీచర్లు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీచర్లు, ఉద్యోగులు ప్రతినెలా పొందే వేతనం నుంచి కొంత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీ ఎఫ్​) కింద జమ చేసుకుంటారు. వీటిని ఆరోగ్యపరమైన అవసరాలకు, ఇండ్ల నిర్మాణం.. రిపేర్లు, పిల్లల చదువులు, పెండ్లిలు, వాహనాల కొనుగోళ్లు వంటి అవసరాలకు జీపీఎఫ్​​లోంచి లోన్​కింద, పార్ట్​ ఫైనల్ కింద డబ్బులు 50 శాతం తీసుకునే అవకాశముంది.

తీసుకున్న మొత్తాన్ని తిరిగి 20 ఇన్​స్టాల్మెంట్లలో చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏండ్ల సర్వీస్​ పూర్తయిన టీచర్లు, ఉద్యోగులు పార్ట్ ఫైనల్ కింద 75% వరకూ పొందొచ్చు. ఇదివరకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం నెలల తరబడి పెండింగ్​లో పెడుతున్నారు. లోన్లు అప్రూవ్​అయ్యాక కూడా ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు. మంజూరయ్యాక జీపీఎఫ్ నుంచి ఇచ్చే అమౌంట్​కు వడ్డీ కూడా సర్కారు ఇవ్వట్లేదు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఆఫీసులలో వేలాది ఫైల్స్ డబ్బులు రాక పెండింగ్​లో ఉన్నట్టు టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు. సాంక్షన్ చేసి ట్రెజరీకి పంపించామని, తమ బాధ్యతేమీ లేదని జెడ్పీ
 అధికారులు పేర్కొంటున్నారు. 

107 కోట్లు పెండింగ్​లో..

రాష్ట్రవ్యాప్తంగా  జెడ్పీ ఉద్యోగులు, టీచర్ల లోన్లు, పార్ట్ ఫైనల్ అమౌంట్ దాదాపు రూ.107 కోట్లు పెండింగ్​లో ఉన్నట్టు టీచర్ సంఘాల నేతలు చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్​లో రూ.16 కోట్లు, ఉమ్మడి నిజామాబాద్​లో రూ.14 కోట్లు, సిద్దిపేటలో రూ.4.67 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలోనూ బకాయిలున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో జనవరి, ఫిబ్రవరి నుంచి కొన్ని జిల్లాల్లో ఏప్రిల్.. మే నుంచి పెండింగ్​లో ఉన్నాయి. తాము దాచుకున్న డబ్బులను, తమ అవసరాలకు ఇవ్వకపోవడమేంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి టీచర్లు,ఉద్యోగులు సర్కారుకు సరెండర్ చేసిన సెలవుల డబ్బులు కూడా ఇవ్వట్లేదు. దీంతో ఉద్యోగులు, టీచర్లు అవస్థలు పడుతున్నారు. మరోపక్క రిటైర్డ్ ఎంప్లాయీస్​ ఫైనల్ సెటిల్మెంట్లు కూడా సర్కారు చేయట్లేదు.

మాక్లూర్ మండలం లోని మదన్​పల్లి హైస్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న. మా పాప పెండ్లికోసం పార్ట్​​ఫైనల్ కింద లోన్​కు అప్లై చేశా. జెడ్పీ ఆఫీసులో రూ.3.50 లక్షలు సాంక్షన్ అయిందని, జులైలోనే చెక్ రాసినమని అధికారులు చెప్పారు. ఇప్పటికీ పైసా రాలే. 

- జగదీశ్వర్, స్కూల్ అసిస్టెంట్


కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రైమరీ స్కూల్​లో ఎస్జీటీగా పనిచేస్తు న్నాను. హౌస్ రిపేర్ పేరుతో రూ.1.50 లక్షలకు జనవరి 25న లోన్ అప్లై చేశా. జులైలో రూ. లక్ష సాంక్షన్ అయిందని, ఉన్నతాధికారులకు పంపించామని జెడ్పీ సిబ్బంది చెప్పారు. కానీ డబ్బులు ఇంకా అకౌంట్​లో పడలేదు.
- ఎల్ఎన్ గౌడ్, టీచర్

అప్లై చేశాక నెల రోజుల్లోగా వస్తే బెటర్

అవసరము న్నపుడు డబ్బులు తీసుకు నేందుకు పెట్టుకున్న జీపీఎఫ్​ లోన్లు సకాలంలో రావట్లేదు. నెలల తరబడి పెండింగ్​లో పెడుతున్నరు. అలాకాకుండా మంజూరైన నెలలోపే ఇచ్చేలా టైమ్ బాండ్ పెట్టుకొని, సీరియల్ ప్రకారం ఇవ్వాలి. సీఎం, ఆర్థిక శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి.
- రాజ్ గంగారెడ్డి, జీహెచ్​ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి