విద్య, వైద్యానికి దేశంలోనే తక్కువ నిధులు

విద్య, వైద్యానికి దేశంలోనే తక్కువ నిధులు

బడ్జెట్​లో చదువులకు 6.57%, హెల్త్ కు 4.18 శాతమే 

హైదరాబాద్, వెలుగు : హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్​లో కీలకమైన విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇతర రాష్ట్రాల బడ్జెట్​తో పోలిస్తే కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి. ఈసారి మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్లలో విద్యారంగానికి రూ.19,093 కోట్లు (6.57%),  వైద్య రంగానికి రూ.12,161 కోట్లు(4.18%) మాత్రమే కేటాయించింది. 2022–23లో రూ.2,56,861 కోట్లలో ఎడ్యుకేషన్​కు రూ.16,085 (6.26%), హెల్త్ కు  రూ.11,237(4.37%) కేటాయించింది. 2021–22లో రూ.2,30,825 కోట్లు కాగా.. ఇందులో విద్యకు రూ.15,564 కోట్లు(6.74 %), వైద్యానికి రూ.6,295 కోట్లు(2.72%) అలకేషన్ చేసింది. ఇతర రాష్ట్రాల బడ్జెట్లతో పోలిస్తే ఈ రెండు రంగాలకు కేటాయింపుల్లో తెలంగాణ కొన్నేండ్లుగా చివరి స్థానంలో ఉంది. 

విద్యకు దేశ సగటులో సగం కూడా ఇవ్వలే

2022-–23 బడ్జెట్​లో దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ బడ్జెట్​లో సగటున 15.2% నిధులను విద్యారంగానికి కేటాయించాయి. ఆ ఏడాది దేశంలోనే అత్యధికంగా విద్యకు ఢిల్లీ ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్ రూ.75,800 కోట్లలో రూ.15,507 వేల కోట్లు (20 %) కేటాయించింది. అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, హిమాచల్, రాజస్థాన్ రాష్ట్రాలు 19 %చొప్పున.. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ 18 %చొప్పున.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరం, సిక్కిం 17 %చొప్పున.. జార్ఖండ్, మేఘాలయ 16% చొప్పున.. హర్యానా, జమ్మూకాశ్మీర్, కేరళ, ఒడిశా 15% చొప్పున నిధులు కేటాయించాయి. అరుణాచల్ 10% నిధులు కేటాయించగా, మిగతా రాష్ట్రాలన్నీ 13 % పైనే బడ్జెట్ లో నిధులు కేటాయించాయి. 10 శాతంలోపు ఫండ్స్ కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ చివర్లో నిలిచింది. ఎడ్యుకేషన్​కు 7% నిధులిచ్చిన సర్కార్.. కనీసం దేశ సగటు (15.2%)లో సగం కూడా కేటాయించకపోవడం గమనార్హం.

వైద్యానికి కేటాయింపుల్లో అట్టడుగున

రాష్ట్రాలు తమ బడ్జెట్​లో కనీసం 8% నిధులను వైద్యరంగానికి వెచ్చించాలని 2020లో నేష నల్ హెల్త్ పాలసీ రెకమండ్ చేసింది. చాలా రాష్ట్రాలు ఈ సిఫార్సులకు చేరువలో ఉండగా.. మన రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. వివిధ రాష్ట్రాలు పోయినేడాది బడ్జెట్​లో హెల్త్​కు సగ టున 6% కేటాయించగా.. తెలంగాణ కేటాయింపులు 4% మించలేదు. ఢిల్లీ ప్రభుత్వం వైద్య రంగానికి 2022–23 బడ్జెట్​లో అత్యధికంగా 9,769(12.88 శాతం) కేటాయించగా.. మేఘాలయ, అస్సాం, గోవా, రాజస్థాన్ 7 శాతం పైనే నిధులు కేటాయించాయి.