బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా

బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి. సర్కారు జాగా ఖాళీగా కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల నుంచి హౌస్​నంబర్లు పొంది వాటితో  కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు కబ్జాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మీడియాలో కథనాలు వస్తే అధికారులు అప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ కబ్జాదారులు మాత్రం జాగాలను ఖాళీ చేయడం లేదు. ఫలితంగా ఇప్పటికే పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ, సింగరేణి స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 

నేషనల్​ హైవే పక్కనే కబ్జాలు..

ఇటీవల కబ్జాదారులు నేషనల్ ​హైవే 363 పక్కన ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేశారు. కొంతకాలంగా గవర్నమెంట్, అసైన్డ్​ భూముల్లో అక్రమ వెంచర్లు వేస్తున్నారు. తాజాగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో హైవే పక్కన ఉన్న భూములను కబ్జా చేస్తున్నారు. గతంలో సింగరేణి లీజుకు తీసుకున్న భూములను గవర్నమెంట్​కు ట్రాన్స్​ఫర్​ ​చేసింది. ఈ భూముల్లోనే డబుల్​బెడ్​రూమ్ లు, కోర్టు కాంప్లెక్స్, ఇరిగేషన్, మిషన్​ భగీరథ ఆఫీసులు, మిషన్​భగీరథ ట్యాంక్​, రైతు వేదికలు నిర్మించారు. మైనారిటీ గర్ల్స్​ రెసిడెన్షియల్​ స్కూల్​కోసం మరో నాలుగు ఎకరాలను కేటాయించారు. వీటి పక్కనే సర్వేనంబర్​112లో తాజాగా కబ్జాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ లీడర్ల అండతో కొంతమంది ఇక్కడ  షెడ్లు నిర్మించారు. వీటిపై మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. ఇక తమను ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో కబ్జా చేసిన స్థలం చుట్టూ రెండు రోజుల కిందట కాంపౌండ్​ వాల్​ఏర్పాటు చేశారు. అయినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

స్పందించని అధికారులు..

కబ్జాలపై ఫిర్యాదులు అందినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఎలాంటి యాక్షన్​ తీసుకోవడం లేదు. ఇదే అదునుగా కబ్జాదారులు మున్సిపల్, గ్రామపంచాయతీ నుంచి ఇంటి నంబర్లు తీసుకొని భూములను తమ సొంతం చేసుకుంటున్నారు. పాత 44 డీప్ మైన్​హాలర్​ను సైతం కబ్జాదారులు తోడేశారు. దీని వెనకాల ఉన్న భూమిని కొందరు కబ్జా చేసి ఫెన్సింగ్ పోల్స్ వేశారు. దాదాపు మూడు ఎకరాల భూమి కబ్జాదారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేషనల్​ హైవేకు కేవలం వంద మీటర్ల దూరంలో ఉండడం, పక్కనే గవర్నమెంట్ ఆఫీసులు, రియల్​ఎస్టేట్​వెంచర్లు ఉండటం, ఎదురుగా 350 ఎకరాలు ఫుడ్​ ప్రాసెసింగ్​జోన్ కు కేటాయించడంతో ఈ భూములకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. ప్రస్తుతం కబ్జా అయిన భూముల విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతున్న విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

కన్నాల శివారులోని 112 సర్వేనంబర్​లో గవర్నమెంట్, అసైన్డ్ భూములు కబ్జా అవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆక్రమణలపై ఆరా తీస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదు. సర్వే చేసి కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటాం.  
- కుమారస్వామి, బెల్లంపల్లి తహసీల్దార్​