
- దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- రెన్యువబుల్ ఎనర్జీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అనుమతి
- గ్రీన్ ఎనర్జీలో రూ. 7 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎన్ఎల్సీ ఇండియాకు గ్రీన్ సిగ్నల్
- ఐఎస్ఎస్ యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లాకు అభినందనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ‘పీఎం ధన్‌ధాన్య కృషి యోజన’ అమలుకు కేంద్ర కేబినెట్గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఏటా రూ. 24 వేల కోట్ల వ్యయంతో 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2025–26 నుంచి మరో ఆరేండ్లపాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రెన్యువబుల్ఎనర్జీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఎన్టీపీసీకి కేబినెట్ఆమోదం తెలిపింది.
ఎన్ఎల్‌సీ ఇండియా తన అనుబంధ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్ఐఆర్ఎల) ద్వారా గ్రీన్ ఎనర్జీలో రూ. 7వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్పెట్టేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో 18 రోజులు అనేక ప్రయోగాలను నిర్వహించి.. విజయవంతంగా భూమిపైకి తిరిగివచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడమే లక్ష్యంగా..
వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ‘పీఎం ధన్‌ధాన్య కృషి యోజన’ను అమలు చేయనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పంటల్లో వైవిధ్యీకరణ, సస్టెయినబుల్అగ్రికల్చర్పద్ధతులను ప్రోత్సహించడం, గోదాముల సదుపాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయనున్నారు. మొత్తం 11 శాఖల్లో ఇప్పటికే అమలవుతున్న 36 స్కీమ్స్, రాష్ట్రంలోని ఇతర పథకాలు, ప్రైవేటు రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీన్ని అమలు చేయనున్నారు.
ఈ కార్యక్రమం కోసం ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నది. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత (అన్ని కాలాల్లోనూ పంటలు సాగుచేయకపోవడం), తక్కువ రుణ లభ్యత అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తించనున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఎంపిక చేస్తారు.ఈ స్కీమ్ పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లా ధన్ ధాన్య సమితి ద్వారా జిల్లా వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల ప్రణాళికను ఖరారు చేస్తారు. ఇందులో ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ పథకం పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు.
రెన్యువబుల్ ఎనర్జీలో ఎన్టీపీసీ పెట్టుబడులు
రెన్యువబుల్ఎనర్జీలో ఎన్టీపీసీ రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేబినెట్ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ప్రస్తుత పరిమితి (రూ. 7,500 కోట్లు)కి మించి ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెట్టుబడిని ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్), దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ల ద్వారా చేస్తారు. 2032
నాటికి 60 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రీన్ ఎనర్జీలో ఎన్ఎల్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆమోదం
దేశంలో గ్రీన్ ఎనర్జీ కెపాసిటీని పెంచేందుకు ప్రభుత్వ రంగ ఎన్‌ఎల్‌సీ ఇండియా తన అనుబంధ సంస్థ ఎన్ఐఆర్‌ఎల్ ద్వారా రూ.7 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ఎన్ఎల్‌సీ ఇండియా 2030 నాటి 10.11 గిగావాట్స్, 2047 నాటికి 32 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీ సామర్థ్యానికి చేరుకునేలే తోడ్పడుతుందన్నారు.