ర్యాలంపాడు లీకేజీ రిపేర్లపై సర్కారు నిర్లక్ష్యం

ర్యాలంపాడు  లీకేజీ రిపేర్లపై సర్కారు నిర్లక్ష్యం
  • ఈసారీ 2 టీఎంసీలే
  • ర్యాలంపాడు  లీకేజీ రిపేర్లపై సర్కారు నిర్లక్ష్యం

గద్వాల, వెలుగు: నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను సర్కారు నిర్లక్ష్యం వెంటాడుతోంది.  రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కట్టకు బుంగలు పడి నీళ్లు లీక్‌‌‌‌ అవుతుండడంతో సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే అవకాశం లేకుండా పోతోంది.  మూడేళ్ల క్రితమే లీకేజీలను గుర్తించినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. రైతుల ఆందోళనతో  నిరుడు సర్వే చేసినా రిపేర్లు మాత్రం చేపట్టడం లేదు.  రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా.. ఒక టీఎంసీ  డెడ్‌‌‌‌స్టోరేజీకి పోయినా మూడు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండు టీఎంసీలకు మించి నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఈ సారి కూడా నిరాశ తప్పట్లేదు.  

2019లో సీపేజీ గుర్తించినా.. 

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని సర్కారు ముందునుంచీ చిన్నచూపు చూస్తోంది. కనీసం మెయింటెనెన్స్‌‌‌‌ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్‌‌‌‌ దెబ్బతింటున్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు.  కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది.  రైతులు నిరసనలు తెలపడంతో 2021లో రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించింది. పూర్తిస్థాయిలో నింపితే కట్టకు ప్రమాదం అని చెప్పి సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు.  దీంతో గత ఏడాది రెండు టీఎంసీల నీటినే నింపారు. 

సర్వేకే ఏడాది

రిటైర్ట్‌‌‌‌ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్లను పరిశీలించి వెళ్లిన అనంతరం లీకేజీల కంట్రోల్‌‌‌‌ కోసం ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు చేపట్టిన సర్వేకే ఏడాది పట్టింది. సర్వే పనులను టెండర్‌‌‌‌‌‌‌‌ ద్వారా హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి గణేశ్‌‌‌‌ కంపెనీ అప్పజెప్పగా బుంగలు ఎలా పడ్డాయి..? ఎలా పూడ్చాలి..? అనే అంశాలపై వారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్‌‌‌‌ను ఆఫీసర్లు డీడీవో (సెంట్రల్ డిజైన్‌‌‌‌ ఆఫీస్)కు ఫార్వర్డ్ చేశారు.  అక్కడి ఆఫీసర్లు దీన్ని పరిశీలించి  క్లారిటీ ఇచ్చేందుకు మరో నాలుగు నెలలు పట్టనున్నట్లు తెలిసింది. 

ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నం.  ప్రస్తుతం సర్వే కంప్లీట్ అయ్యింది. సీడీవో  ఆదేశాల మేరకు రిపేర్లు చేస్తం. ఈసారి కూడా రెండు టీఎంసీలు నింపుతం. వరద వచ్చినప్పుడల్లా ఎత్తిపోస్తూ సాగునీరిస్తం.  
ఈఈ వెంకటేశ్వరరావు,   ర్యాలంపాడు ఇన్‌‌చార్జి

సగం ఆయకట్టే..

నెట్టెపాడు పరిధిలోని ఏడు రిజర్వాయర్లలో ర్యాలంపాడే పెద్దది.  నాలుగు టీఎంసీలు సామర్థ్యంతో దీన్ని నిర్మించగా.. ఎత్తిపోతల కావడంతో లెఫ్ట్ కెనాల్ 25 వేల ఎకరాలు, రైట్ కెనాల్ ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.  కానీ, ప్రస్తుతం రెండు టీఎంసీలే కావడంతో సగం ఆయకట్టుకు నీళ్లిచ్చేది కూడా అనుమానమే. చివరి ఆయకట్టు రైతులు వరుసగా  రెండో యేడు కూడా తమ పొలాలను పడావు వేయాల్సి పరిస్థితి నెలకొంది.