కొత్త పంచాయతీలకు నో పోలింగ్ బూత్

కొత్త పంచాయతీలకు నో పోలింగ్ బూత్
  • ఒకచోట కూలిపోయే భవనం.. ఇంకో చోట జారిపోయే ర్యాంప్
  • పోలింగ్ బూత్ లలో పూర్తికాని కరెంట్ పనులు
  • నీళ్ళు, టాయిలెట్ అంతంతే

కాగజ్ నగర్,వెలుగు: ఎన్నికల్లో తమ ఓటు వినియోగించుకోవడానికి కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల్లో  ఓటింగ్ అవకాశాన్ని సర్కార్  కల్పించలేదు. అలాగే పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సౌలత్ లు పూర్తిగా ఏర్పాటు చేయలేదు. కనీస అవసరాలు తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్  చాలా పోలింగ్ బూత్ లలో కనిపించడం లేదు. చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి యూపీఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన 177 నంబర్ కేంద్రం పాత స్కూల్  బిల్డింగ్ భవనంలో  పనికి రాదని వదిలేసిన భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కనీసం గదిలో ఇప్పటికీ కరెంటు ఏర్పాటు చేయలేదు.

ఇక టాయిలెట్ సౌకర్యం లేదు.  ఇక్కడ మంచి తరగతి గదులు ఉన్నప్పటికీ అందులో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇక భూరెపల్లి గ్రామ పంచాయతీలోని బోగుడగూడ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో టాయిలెట్లు లేవు. పక్కనే ఉన్న పంచాయతీ టాయిలెట్లు ఉన్నా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇక్కడ ర్యాంప్ అడుగు పెడితే జారిపడేలా ఉంది. గంగాపుర్ లోని ప్రైమరీ స్కూల్ లో ఉన్న కేంద్రంలో ర్యాంప్ నకు రైలింగ్ లేదు. నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాటు టాయిలెట్స్ పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. 

కొత్త పంచాయతీలకు "నో" పోలింగ్ బూత్

ఇదంతా ఒకెత్తయితే సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ అవకాశం కల్పించలేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ ఓటర్లు ఒక్కోచోట  అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న బూత్ లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. పోలింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీల్లో ఒక్కో చోట 500 మందికి పైగా ఓటర్లు ఉన్నా అధికారులు   చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.