అమ్మకు రూ. 5 వేలు.. రాష్ట్రంలో మాతృ వందన స్కీమ్ అమలుకు ప్రభుత్వం ప్లాన్

అమ్మకు రూ. 5 వేలు.. రాష్ట్రంలో మాతృ వందన స్కీమ్ అమలుకు ప్రభుత్వం ప్లాన్
  • శిశుసంక్షేమ శాఖ నుంచి సర్కారుకు ప్రతిపాదనలు 
  •     ఈ స్కీమ్ ద్వారా మొదటి కాన్పుకు రూ.5 వేలు
  •     రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 6 వేల ఆర్థిక సాయం

హైదరాబాద్, వెలుగు: గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సాయం అందించే  ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) స్కీమ్‌‌‌‌ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ స్కీమ్​కింద మొదటి కాన్పుకు రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే  రూ. 6 వేలు అందజేయనున్నారు.  దీని అమలు బాధ్యతలను రాష్ట్రంలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ చేపట్టనున్నది.  రాష్ట్ర సర్కారుకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవలే రాష్ట్ర విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్​అందజేసింది.   

3 విడతలుగా సాయం..

ఈ స్కీమ్ ద్వారా  తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు 3 విడుతలుగా రూ. 5 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. గర్భం దాల్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోగానే మొదటి విడతగా రూ. వెయ్యి, గర్భం దాల్చిన 6 నెలల తర్వాత రెండో విడతగా రూ. 2వేలు, ప్రసవం తర్వాత బిడ్డకు మొదటి దశ టీకాలు వేయించగానే మూడో విడతగా రూ. 2 వేలు నేరుగా లబ్ధిదారు బ్యాంకు అకౌంట్‌‌‌‌లో జమ చేస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే... ఆ తల్లికి ఒకే విడతలో రూ.6 వేలు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఆడపిల్లల సంఖ్యను పెంచడం, భ్రూణ హత్యలను అరికట్టడం ఈ స్కీమ్ ఉద్దేశ్యంలో భాగం. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్​ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులను అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలు గుర్తిస్తారు. వారిని స్కీమ్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయించడం, విడతల వారీగా నగదు అందేలా చూడటంలాంటి కీలక బాధ్యతలను వీరే నిర్వర్తిస్తారు.

గత సర్కారు అమలు చేయకపోవడంతో నిధులు వృథా

గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2017 లో పీఎంఎంవీవైను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్నప్పటికీ.. గత బీఆర్ఎస్​ సర్కారు  మన రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసింది. దీంతో కేంద్రం నుంచి ఏటా రాష్ట్రానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేద గర్భిణులు, బాలింతలు  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కోల్పోయారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతోనైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.