మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు

మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం :  మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు
  • పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు 

మంథని, వెలుగు:  మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల  శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. సోమవారం మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆదాయ మార్గాలు పెంచి, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు టైలరింగ్‌‌‌‌, మొబైల్ క్యాంటీన్, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి  వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం  మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో స్కానింగ్ మిషన్, ఆర్‌‌‌‌‌‌‌‌వో వాటర్ ప్లాంట్, ఔట్ పేషెంట్ రూమ్, పేషెంట్ వెయిటింగ్ హాల్, పిల్లల వార్మర్స్, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో  లీడర్లు కొత్త శ్రీనివాస్, కాచే, అయిలి ప్రసాద్, సదానందం, రాంచందర్ రావు, వెంకన్న, తిరుపతియాదవ్, తదితరులు పాల్గొన్నారు.