
ఖజానా నింపుకొనేందుకు రాష్ట్ర సర్కారు కొత్త దారులు వెతుక్కుంటున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్, కోకాపేట భూములను వెంచర్లు చేసి, వేల కోట్లకు వేలం వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్ బిజినెస్‌లో దిగబోతున్నది. జిల్లాల్లోని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఒకే చోట 25 ఎకరాలకు తగ్గకుండా ప్రతి జిల్లాలోనూ కనీసం 2 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్న చోట వాటిని ఉపయోగించుకుంటూ, లేని చోట రైతుల నుంచి సేకరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీంతో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పోటీ పడుతూ అన్ని హంగులతో వెంచర్లు వేసేందుకుగాను భూ సమీకరణపై కలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఫీల్డ్ లెవల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తున్న తహసీల్దార్లు.. వెంచర్‌కు కావాల్సిన 25 ఎకరాలు ఒకే చోట దొరకని ప్రాంతాల్లో రైతుల నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రియల్ఎస్టేట్ వ్యాపారుల్లా తహసీల్దార్లు!
తహసీల్దార్ల పని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా తయారైంది. లే ఔట్లు వేసేందుకు సూటయ్యే అసైన్డ్ , ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడ్డారు. నేషనల్, స్టేట్ హైవేలను ఆనుకొని డిమాండ్ ఉన్న భూముల రైతులను గుర్తించి వారితో మాట్లాడుతున్నారు. వరంగల్ సిటీని ఆనుకొని ఉన్న పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట, ఏనుమాముల, మొగిలిచర్ల గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం కొన్ని రోజులుగా పూణెకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో భూ సర్వే చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూముల్లో సర్వే చేస్తుండడంతో రైతులు అడ్డుకొని ఆందోళనకు దిగుతున్నారు. ‘‘పంటలు వేయడం ఆపండి.. రియల్ వ్యాపారం చేద్దాం.. మీకూ కొన్ని ప్లాట్లు ఇస్తాం..’’ అని ఆఫీసర్లు చెప్తున్నారని, కానీ పంటలు పండే భూములను చూస్తూ చూస్తూ ఎలా అమ్ముకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో ల్యాండ్‌పూలింగ్‌పై ఆఫీసర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘రెవెన్యూ శాఖపై ఇప్పటికే పని ఒత్తిడి ఉంది.. అగ్రికల్చర్భూముల రిజిస్ట్రేషన్బాధ్యతలు కూడా తహసీల్దార్లకే అప్పగించారు. ఇది చాలదన్నట్లు కొత్తగా ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఇప్పటికే మెగా విలేజ్ పార్కుల భూసేకరణ కోసం అసైన్డ్ భూముల్లోకి వెళ్తే రైతులు తిరగబడుతున్నారు. ప్రజా అవసరాల కోసం కదా అని సర్ది చెప్తున్నాం. కానీ ఇప్పుడు రియల్‌వ్యాపారం కోసం అసైన్డ్ భూముల జోలికి వెళ్తే ఎలా సమర్థించుకోగలం?’’ అని వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఆర్డీవో వాపోయారు. ఫీల్డ్ లెవల్లో ఇలాంటి సమస్యలను సర్కారు దృష్టికి వెళ్లినా పట్టించుకునే పరిస్థితిలో లేదని ఆఫీసర్లు అంటున్నారు.
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలు ఇట్లా..
హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం అమలువుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకారం.. తమ భూమిని వెంచర్‌గా డెవలప్ చేయాలని ఆసక్తి ఉన్న ల్యాండ్ ఓనర్లతో ఆయా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఇందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం భూములు ఇచ్చిన వాళ్ల నాలా కన్వర్షన్ చార్జీలతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు భరిస్తాయి. లే ఔట్ అప్రూవల్ అయ్యాక ఆరు నెలల్లోపే కొన్ని ప్లాట్లను ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి, మరికొన్నింటిని అథారిటీలు వేలం వేస్తాయి. ల్యాండ్ ఓనర్లు తమకు కేటాయించిన ప్లాట్లను వాళ్ల ఇష్టానుసారం అమ్ముకోవచ్చు. గతంలో హెచ్ఎండీఏ లేఔట్ చేస్తే.. సగం ప్లాట్లను ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి, మిగతా సగం ప్లాట్లను వేలం వేసింది. అయితే ఇప్పుడు ఈ రేషియోలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూ యజమానులకు 60 శాతం, హెచ్ఎండీఏకు 40 శాతం చొప్పున ప్లాట్లు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కూడా 60 : 40 రేషియాలో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే తహసీల్దార్లకు కలెక్టర్లు క్లారిటీ ఇచ్చారు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి
ఖమ్మం జిల్లాలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫుల్ జోష్ లో ఉంది. ఖమ్మం రూరల్,అర్బన్, రఘునాథపాలెం, కొణిజెర్లతో పాటు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు ప్రభుత్వ వెంచర్లు కూడా రాబోతున్నాయి. ఖమ్మం–- సూర్యాపేట, ఖమ్మం-–విజయవాడ, ఖమ్మం–కోదాడ రోడ్లు నేషనల్ హైవేలుగా విస్తరణ పనులు జరుగుతుండడంతో వీటి పక్కన ఉండే భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని మండలాల ఎమ్మార్వోలు, మధిర, వైరా, సత్తుపల్లి ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సమావేశమయ్యారు. జిల్లాలో లే ఔట్‌కు అనువైన అసైన్డ్ భూములు, ప్రభుత్వ, పట్టా భూములను గుర్తించి, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను ప్రభుత్వ పరంగా లే ఔట్ చేయడం వల్ల భూముల విలువలు పెరుగుతాయని, దాని వల్ల రైతులు, భూ యజమానులకు ఆర్థికంగా లాభం జరుగుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.
నల్గొండ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కోసం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి బైపాస్ రోడ్డు దగ్గర 626, 625 ప్రభుత్వ సర్వే నంబర్లలో 20 ఎకరాల భూమితో పాటు వాసవి కాలేజీ, అగ్రిగోల్డ్ పరిధిలో 180 ఎకరాల భూమిని గుర్తించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తం 200 ఎకరాల్లో భూమిని గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు వారు సమర్పించారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రతి మండలంలో 50 ఎకరాలకు తగ్గకుండా భూమి సేకరించాలని తహసీల్దార్లకు ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. హైవే, డిస్ట్రిక్ట్ హైవేలపై ఎకరా రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు రేట్ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో మండలంలో 50 ఎకరాలు దొరకడం కష్టమని తహసీల్దార్లు చెప్పినట్లు తెలిసింది.
సూర్యాపేట జిల్లాలో ల్యాండ్‌పూలింగ్‌పై ఇటీవల తహసీల్దార్లతో కలెక్టర్ రివ్యూ చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి వివరాలివ్వాలని మీటింగ్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.
వనపర్తి జిల్లాలో ల్యాండ్ ఫూలింగ్ కింద ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలు సేకరించారు. తహసీల్దార్లు పట్టణాల్లోని అసైన్డ్, బంజరు భూముల వివరాలు కలెక్టర్‌కు ఇచ్చారు. వనపర్తి, పెద్ద మందడి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, ఖిల్లాఘణపురం, పానగల్ మండలాల్లో 1,200 ఎకరాల భూములు ఉన్నాయని నివేదిక అందించారు. దేవాలయ భూములను కూడా సేకరించే పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
మెదక్ జిల్లాలో తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్ మండలాల పరిధిలో పరిశ్రమల కోసం అనువైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులు చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో భూ సేకరణలో ఆలస్యం అవుతోందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో 45, పాల్వంచలో 60 ఎకరాలు సేకరించారు.మంచిర్యాల జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని ఇటీవల అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్లను
ఆదేశించారు. దీంతో తహసీల్దార్లు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ప్రాథమికంగా 150 ఎకరాల అసైన్డ్ భూమి అందుబాటులో ఉందని గుర్తించారు. మిగతా మండలాల్లో సర్వే కొనసాగుతోందని ఆఫీసర్లు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా కనీసం వెయ్యి ఎకరాలు సేకరించడానికి ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ భూమి వెయ్యి ఎకరాలు కూడా దొరకడం కష్టంగా ఉండడంతో ప్రైవేట్ లాండ్స్‌పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని ప్రైవేట్ భూముల యజమానులతో మాట్లాడేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే వర్గల్, ములుగు, మర్కుక్, జగదేవ్‌పూర్‌లో అసైన్డ్ భూములపై సర్వే నిర్వహించి వివరాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తహసీల్దార్లకు సూచించారు. దీంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు గ్రామాల వారీగా సర్వే ప్రారంభించారు.
హైవేల వెంట ఉన్నభూములకు ప్రయారిటీ
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా భూములు సేకరించి లే అవుట్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. జిల్లాకు కనీసం 2వేల ఎకరాలు సేకరించి, వాటిల్లో వెంచర్లు డెవలప్ చేసి అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరాలు, పట్టణాల పరిధిలోని అర్బన్ డెవలప్ మెంట్ ఏరియాలతోపాటు హైవేలను ఆనుకొని ఉన్న మండలాల్లో ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. హైవేల పక్కన ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములు గుర్తించి సమీకరించడం మొదటి ప్రాధాన్యత కాగా, ఒకే చోట కనీసం 25 ఎకరాలు అందుబాటులో లేని చోట ప్రభుత్వ భూములను అనుకొని ఉన్న రైతుల నుంచి వారి అంగీకారంతో ప్రైవేట్ భూములను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ పై దాదాపు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లకు కలెక్టర్లు క్లియర్‌గా అవగాహన కల్పించారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా భూ సమీకరణపై సర్వేలు జరుగుతుండగా.. ఇతర చోట్ల భూ సమీకరణపై దృష్టిపెట్టాలని కలెక్టర్లు ఆదేశించారు.