శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే స్కూళ్లు, కాలేజీలు

శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే స్కూళ్లు, కాలేజీలు
  • వానలకు తడిసి గోడలపై పాకురు, మొక్కలు పెరుగుతున్న పరిస్థితి
  • చినుకులు మొదలవగానే కరెంట్​సప్లయ్ బంద్​చేస్తున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని గవర్నమెంట్​స్కూళ్లు, కాలేజీలు చాలా వరకు పురాతన భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గట్టిగా గంట వర్షం కురిస్తే ఏ గోడ కూలుతుందో.. ఏ వైపున స్లాబ్​ పెచ్చులూడి పడతాయోనని స్టూడెంట్లు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. చినుకులు మొదలైతే అయితే చాలా చోట్ల కరెంట్ సప్లయ్​బంద్​చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏటా వానా కాలానికి ముందే శిథిలావస్థకు చేరిన కట్టడాలను గుర్తిస్తారు. ఇండ్లు, ఆఫీసులు, షాపులు, ప్రభుత్వ భవనాలు ఇలా ఏవి ప్రమాదకరంగా ఉన్నా వెంటనే కూల్చేస్తారు. ఇలా కూలేందుకు సిద్ధంగా ఉన్న స్కూళ్లు, కాలేజీల భవనాలు సిటీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ విద్యాశాఖ, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేక ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. స్కూళ్లలోని సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన ఉండట్లేదని టీచర్లు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పాఠాలు చెబుతున్నామని వాపోతున్నారు. 

చూసీ చూడనట్లు..

సిటీలోని కొన్ని స్కూళ్లు, కాలేజీల భవనాలు ఏండ్ల కింద కట్టినవి. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రిపేర్లు చేయడం లేదు. క్లాస్​రూముల్లోని స్లాబులు పెచ్చులు ఊడి పడుతున్నాయి. వానలకు గోడలు నానుతూ పాకురు పడుతున్నాయి. కొన్నిచోట్ల క్లాసుల్లోకి వాన నీళ్లు చేరుతున్నాయి. బహదూర్​పురా మండలంలోని దారుల్ షిఫా గవర్నమెంట్ హైస్కూల్ లో ఇటీవల వానలకు గోడలు కూలాయి. ఈ స్కూల్ భవనాన్ని 1920లో కట్టారని హెచ్‌‌ఎం మసూద్ అహ్మద్ తెలిపారు. వానల కారణంగా గత నెలలో రెండు సార్లు సెలవు ఇచ్చారు. భారీ వర్షం కురిసినప్పుడు 3 అడుగుల మేర నీరు నిలబడిందని హెచ్ఎం తెలిపారు. పూర్తిగా పాతబడిన ఓ పోర్షన్ కి తాళం వేశామని చెప్పారు. సమస్యను జిల్లా కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఏం చేయలేమని చేతులెత్తేశారని తెలిపారు. ఈ స్కూల్​కు 2–3కిలోమీటర్ల అవతల నుంచి వరద నీరు మూసీలోకి వెళ్తుంది. పైప్​లైన్లు సరిగా లేక నీరంతా స్కూల్లోకి చేరుతోంది. చంచల్‌‌గూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాలేజీ భవనం మొత్తం పాకురుపట్టి భయానకంగా మారింది. ఒకే ఆవరణలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. జూనియర్​కాలేజీలో వందల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఇటీవల బల్దియా అధికారులు కాలేజ్‌‌ ని పరిశీలించి క్లాసులు నిర్వహించొద్దని నోటీసులు ఇచ్చారు. దీంతో జూనియర్​కాలేజీ స్టూడెంట్లను స్కూల్‌‌, డిగ్రీ కాలేజీల్లోని క్లాసు రూముల్లో అడ్జెస్ట్ చేశారు. ముషీరాబాద్‌‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రమాదకరంగా ఉంది. గోడలు పాకురు పట్టి ఉరుస్తున్నాయి. స్లాబు పెచ్చులు ఊడుతున్నాయి. భయపడుతూనే తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తున్నారు.  వారం రోజుల కిందట కుషాయిగూడ ప్రభుత్వ స్కూల్​లోకి వరద చేరి స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారు. టీచర్లు లైట్లు, ఫ్యాన్లు ఆపేశారు. మన్సురాబాద్‌‌లోని ప్రభుత్వ స్కూల్​లో కొన్ని రోజులుగా కరెంట్ ఉండటం లేదు. బిల్లు కట్టలేదనే కారణంతో విద్యుత్ అధికారులు కనెక్షన్​కట్ చేసినట్లు తెలుస్తోంది. స్కూల్‌‌లోని స్లాబ్ నుంచి నీరు కారుతోంది. ఫలక్‌‌నుమా, అమీర్‌‌‌‌పేట, యూసఫ్ గూడ, షేక్‌‌పేట బీజేఆర్‌‌‌‌నగర్, అఫ్జల్ గంజ్, ధూల్‌‌పేట, కాప్రా, ముషీరాబాద్‌‌లోని మొరంబండ, అంబర్ నగర్ బస్తీ, బోయగూడ, రెజిమెంటల్, ఎల్‌‌బీనగర్ ఇలా అనేక ప్రాంతాల్లోని ప్రైమరీ, హైస్కూళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. వాన మొదలవగానే హెడ్‌‌ మాస్టర్లు, టీచర్లు కరెంట్​బంద్​చేసి క్లాసులు ముగిస్తున్నారు.ఆసిఫ్‌‌నగర్‌‌‌‌, సబ్జిమండి నగర్ ప్రాంతాల్లో వర్షం పడితే సెలవు ఇచ్చేస్తున్నారు.  

620 భవనాలు గుర్తించినప్పటికీ..

ఇటీవల 620 పురాతన భవనాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు 231 భవనాలు కూల్చివేశారు. 294 భవనాలను ఖాళీ చేయించి సీల్ చేశారు. కొన్నింటికి రిపేర్లు చేయాలని సూచించారు. అయితే 30 సర్కిళ్లలో పురాతన భవనాలను లిస్ట్ అవుట్ చేసిన అధికారులు వాటిలో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయనేది చెప్పలేకపోతున్నారు. విద్యాశాఖ అధికారులకు కూడా అవగాహన లేదు. చంచల్‌‌గూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శిథిలావస్థకు చేరిందని బల్దియా అధికారులు నోటీసులు ఇవ్వగా ఆ సమాచారం తమకు తెలియదని డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒడ్డెన్న తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న కాలేజీల వివరాల లిస్ట్ బల్దియా నుంచి తమకు రాలేదని చెప్పారు.

భయపడుతూ పాఠాలు చెబుతున్నం

వర్షం పడితే బిల్డింగ్​ బయట.. లోపల అనే తేడా ఉండడం లేదు. గోడలన్నీ ఉరుస్తున్నాయి. ఎక్కడికక్కడ పాకురు పట్టి ఉన్నాయి. క్లాస్​రూములన్నింటిలో స్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. బిల్డింగ్​ శిథిలావస్థకు చేరిందని, ఏ టైంలో ఏం జరుగుతుందోననే భయంగా ఉందని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశాం. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఆందోళనగా ఉంటోంది. అలాగే పాఠాలు చెబుతున్నాం.

– ఓ టీచర్, గవర్నమెంట్ హైస్కూల్, ముషీరాబాద్

ఇంకో బిల్డింగ్ కి మార్చాలి

మా స్కూల్ పరిస్థితి ఏటేటా మరింత ప్రమాదకరంగా మారుతోంది. వర్షం కురిసిన ప్రతిసారి క్లాస్​రూములను వరద ముంచెత్తుతోంది. బిల్డింగ్​శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల గోడలు కూలిపోయాయి. విద్యాశాఖ, బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇలాగే స్కూల్ కొనసాగిస్తే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. కొత్త బిల్డింగ్​కట్టి అందులోకి షిఫ్ట్​చేయాలి. వాన పడితే పిల్లలను తల్లిదండ్రులు స్కూలుకు పంపించడం లేదు. విద్యాశాఖ అధికారులు స్పందించాలి. 

- మసూద్ అహ్మద్, హెచ్‌‌‌‌ఎం, దారుల్​షిఫా గవర్నమెంట్ హైస్కూల్‌‌‌‌