
- సర్కారు బడుల దశ మార్చాలి
- జూన్ 10లోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి
- టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
- జిల్లాలో పనుల పరిశీలన
- అనంతరం అధికారులతో సమీక్ష
సంగారెడ్డి టౌన్, వెలుగు: ‘మన ఊరు మన బడి’ ద్వారా సర్కారు బడుల దశ మార్చాలి అని టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. జిల్లాలో మన ఊరు- మన బడి పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్నపనులను జూన్ 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 441 పాఠశాలల్లో పనులు చేపట్టామని, పూర్తయిన స్కూళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అభివృద్ధి చేసిన పాఠశాల లో ‘మన ఊరు మన బడి ద్వారా ఆధునీకరించినట్టు’ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి గురించి తల్లిదండ్రుల మీటింగ్ లో తెలియజేయాలన్నారు. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ఆయా పనులను, చిన్నచిన్న రిపేర్లు ఉన్నా పూర్తి చేయాలి. ప్రభుత్వం ప్రత్యేకించి అన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, వాటర్ ఉండేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. పనుల పర్యవేక్షణలో ఎంఈఓలది కీలక పాత్ర అని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో పనులు మెల్లిగా సాగుతుండటంతో ఆయన డీఈలపై, ఏఈలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎంబీ రికార్డ్ చేయాలి..
పనులు పూర్తయిన వెంటనే ఎండీ రికార్డ్ చేయాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న వాటిని రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన పనులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పాఠశాలలు, పూర్తయినవి, అదనపు తరగతి గదులనిర్మాణం, పూర్తయినడైనింగ్ హాల్స్, ఇంకా చేయాల్సినవి, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు తదితరాలను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ఈఈ లు,డీఈలను అడిగి తెలుసుకున్నారు.
పూర్తయిన పనులపై సంతృప్తి..
సదాశివపేట, నందికంది, జహీరాబాద్ , దిగ్వాల్ పాఠశాలల్లో పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా పనుల పురోగతి, నాణ్యతపై చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.