దళిత బంధు  కోసం మొదలైన సర్కారు సర్వే

దళిత బంధు  కోసం మొదలైన సర్కారు సర్వే
  • దళిత  కాలనీల బాట పట్టిన ఆఫీసర్లు
  • ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి, పీఆర్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగి
  • ముందుగా మౌలిక వసతులపై ఆరా​.. 
  • రెండు రోజుల్లో ప్రపోజల్స్​ రెడీ చేసి పంపాలని కలెక్టర్ ఆదేశాలు 

కరీంనగర్, వెలుగు: ఇన్ని రోజులు హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీల దిక్కు చూడని అధికారులంతా ఇప్పుడు అక్కడే చక్కర్లు కొడుతున్నరు. సౌలతులు ఎట్లున్నయని ఎంక్వైరీ చేస్తున్నరు. ఎన్నడో పడావుబడ్డ కమిటీ హాల్​కు పూత పూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నరు. సీసీ రోడ్లకు నోచుకోని బజార్లలో ఎన్ని మీటర్లు రోడ్డు వెయ్యాల్నని టేపులు పట్టి కొలుస్తున్నరు. ఏండ్ల నుంచి తహసీల్దార్​ ఆఫీసు చుట్టూ తిరిగినా పరిష్కారం కానీ భూ పంచాయితీని జల్దిన తెంపేస్తమని చెప్తున్నరు. బజార్లల్ల లైట్లు పెట్టిస్తమని, ఏడ పోళ్లు పాతాల్నని, ఎట్ల తీగలు గుంజాల్నని రాసుకపోతున్నరు. దళిత బంధుకు అర్హులను గుర్తించే క్రమంలో ముందుగా దళితవాడల్లో సౌలతులపై ఇట్ల అధికారులు సర్వే షురూ చేసిన్రు. 
రెండు రోజులు.. 200 అధికారులు..
మూడు రోజుల కింద ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ ఏర్పాటు చేసిన దళిత బంధు స్కీంపై  రివ్యూ తర్వాత క్షేత్ర స్థాయిలో పనులు చకచక కొనసాగుతున్నాయి.  బుధవారం ఉదయం కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో పీఆర్, ఎలక్ట్రిసిటీ, కార్యదర్శులతో అవగాహన సమావేశాన్నిఏర్పాటు చేశారు. సర్వే చేయాల్సిన అంశాల గురించి వివరించారు. రెండు రోజుల్లో రిపోర్టు అందించాలని ఆదేశించారు. వెంటనే అధికారులంతా ఫీల్డ్​కు వెళ్లి మౌలిక వసతులపై సర్వే మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న 139 ఎస్సీ కాలనీల్లో పర్యటిస్తున్నారు.  ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి, ఎలక్ట్రిసిటీ ఉద్యోగి, పీఆర్ ఇంజనీర్ ను అలాట్ చేశారు. ఇలా మొత్తం 106 మంది ఏఈలతో పాటు  ప్రతి మూడు గ్రామాలకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించారు. ప్రతి మండలానికి ఒక ఎంపీడీవో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా 200 మందికి పైగా అధికారులు రెండు రోజుల పాటు సర్వే చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై రిపోర్టును కలెక్టర్ కు అందించనున్నారు.  
ఏం చేస్తరు? 
దళిత బంధు పథకం ప్రవేశ పెడుతున్న సర్కారు మొదటగా దళిత కాలనీల్లో మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనే అంశాల మీద దృష్టి పెట్టింది. ప్రతి దళిత వాడను అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి.. అక్కడ మొత్తం ఎన్ని డ్రైన్లు ఉన్నాయి.. ఇంకా ఎన్ని కావాలి.. మొత్తం ఎన్ని సీసీ రోడ్లు ఉన్నాయి.. ఇంక ఎన్ని అవసరం ఉన్నాయనే వివరాలను వారికి అందించిన ఫార్మాట్ లో రాయాలి. స్ట్రీట్ లైట్ పోల్స్ ఇంకా ఎన్ని అవసరమైతాయో వివరాలను ఈ సర్వేలో భాగంగా చేస్తున్నారు. కమ్యూనిటీ హాళ్లు ఆయా కాలనీల్లో ఉన్నాయా.. లేకపోతే గ్రామకంఠంలో ఏమైనా మిగులు భూమి ఉందా.. అనే విషయాన్ని కూడా చూస్తున్నారు. ఒక వేళ గతంలో కట్టినవి.. సగంలో మిగిలిపోయినవి ఉన్నా.. వాటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతాయో అంచనాలు తయారు చేస్తున్నారు.  ఓవరాల్ గా ఆయా కాలనీల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా ఈ సర్వే జరుగుతది. ఫీల్డ్​లోకి వెళ్లిన పీఆర్ ఇంజినీర్లు వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. ఈ 139 దళిత వాడల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఎంత బడ్జెట్ అవసరం అవుతుందనేది అంచనాలు రెడీ చేస్తారు. అయితే.. వెంటనే నిధులు శాంక్షన్  చేసి పనులు మొదలు పెడతారా.. లేక సర్వేలతోనే సరిపుచ్చుతారా అనేది చూడాలి. 
త్వరలో వ్యక్తిగత సర్వే
మొదటి దశలో హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీల్లో  పరిస్థితిని అంచనా వేసేందుకు సర్వే చేస్తున్నారు. దీని తర్వాత ఆ కాలనీల్లో ఉంటున్న  కుటుంబాల ఆర్థిక స్థితిగతుల వివరాలపై సర్వే చేయనున్నారు. వారికి  పక్కా ఇల్లు ఉందా.. ఎంత జాగ ఉంది.. ఇంట్లో సరాసరి ఆదాయం ఎంత... ఇంట్లో చదువుకున్న వాళ్లు ఉన్నరా..  ఉంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. ఉద్యోగాలు చేసే కుటుంబాలు ఏమైనా ఉన్నయా.. అనే కోణంలో వ్యక్తిగతంగా సర్వే చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇది పూర్తయితే దళిత బంధు పథకానికి ఎవరు అర్హులు.. ఎవరు కాదనేది ఈజీగా తెలుసుకోవచ్చనేది సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం.