
- బొల్లారం, చందుర్తిలో ఫర్టిలైజర్ దుకాణాలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల/ వేములవాడ రూరల్/ చందుర్తి, వెలుగు : ఇందిరా మహిళా శక్తి కింద ఏర్పాటు చేస్తున్న ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో శ్రీ శివరామ, చందుర్తిలో తులసి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామన్నారు.
గంభీరావుపేటలో విజయలక్ష్మి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాన్ని శనివారం ఉదయం మహిళా సంఘం బాధ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీఆర్డీఓ శేషాద్రి, గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ విజయ పాల్గొన్నారు.
దివ్యాంగుల పెట్రోల్ బంక్‌ను ఆదరించాలి
దివ్యాంగుల పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. సిరిసిల్ల బై పాస్ రోడ్ లో ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిల్లింగ్ స్టేషన్ ను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టర్నోవర్ పెంచడానికి అన్ని ప్రభుత్వ వాహనాలకు ఇక్కడే డీజిల్ పెట్రోల్ పోయించుకోవాలని అందరికీ సూచించాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు.