ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్‌
  • సీఎం కుర్చీని టచ్ కూడా చేయలేరు

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్‌లో మార్పు రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుతంత్రాలను ఆయన ఆపడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి సర్కార్‌ను దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోందని చెప్పారు. ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఊడ్చిపెట్టుకుపోతుంటే.. మరోవైపు ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు.

 ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబుర్లు చెబుతూ, బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి ఆపసోపాలు పడుతున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి కేసీఆర్ అబద్ధాలను నమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వచ్చారని, బక్‌వాస్ ముచ్చట్లు చెబుతున్నారని ఫైర్‌‌ అయ్యారు. ప్రజలు అధికారం నుంచి తన్ని తరిమేసినా కేసీఆర్‌‌కు సిగ్గు రావడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుతంత్రాలు చేసినా పదేండ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని కనీసం టచ్‌ కూడా చేయలేరన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్‌ గేటును కూడా దాటరని జోస్యం చెప్పారు. కేసీఆర్, బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలని, ఈ పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి.. ప్రజా పాలన‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.