
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రహరీ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నత నైపుణ్యం, అనుభవం కలిగిన టీచర్లు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్కూళ్లు ఆదరణ కోల్పోయాయని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ప్రభుత్వ స్కూళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందించాలనే సంకల్పంతో.. ప్రభుత్వ స్కూళ్లలో పని చేసే టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో బొమ్మలరామారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ధనావత్ సునీత, స్కూల్ స్టాఫ్, అధికారులు తదితరులు ఉన్నారు.