ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం : అజయ్ కుమార్

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం :  అజయ్ కుమార్
  • అప్రమత్తతతో సీజనల్ వ్యాధులకు చెక్
  • రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్

బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల కేసులు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ కోటేశ్వర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్, వైద్య సిబ్బందితో కలిసి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు. ఆస్పత్రిలో సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 

మాతా-శిశు ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మంచిర్యాల జిల్లాలో గతేడాది మలేరియా కేసులు 200 నమోదు కాగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య 20 మాత్రమేనన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బయోమెడికల్ ఇంజనీర్ శ్రీనివాస్, డాక్టర్ షబ్బీర్ రెహమాన్, డాక్టర్ కిరణ్ కుమారి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి 

లక్సెట్టిపేట, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు అలర్ట్​గా ఉండాలని కమిషనర్ అజయ్ కుమార్ సూచించారు. లక్సెట్టిపేటలో కొత్తగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఓపీ, వార్డులను పరిశీలించి పేషెంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్లు ఉన్నారు.