అంగన్​వాడీలపై అలసత్వం వద్దు

అంగన్​వాడీలపై అలసత్వం వద్దు

భారతదేశంలోని బాలబాలికలకు, గర్భిణులకు ముఖ్యంగా పేదవారి పిల్లలకు, పేద మహిళలకు పుష్టికరమైన ఆహారం అందటం లేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం అగన్​వాడీ కేంద్రాల వ్యవస్థను 1975లో ప్రవేశపెట్టింది. అంగన్​వాడీ కేంద్రానికి, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా కలిపి వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాలు  ఇస్తున్నాయి. అంగన్​వాడీ వ్యవస్థ వచ్చే రెండేండ్లలో 50 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నది. స్త్రీ,శిశు సంక్షేమాభివృద్ధి కోసమే ఏర్పాటైన అంగన్​వాడీ కేంద్రాలు ఇంకా వాటి లక్ష్యాలను అందుకోవడం లేదు. ఎందుకంటే సమాజంలో వ్యవస్థ పనిపట్ల అవగాహన పెరిగే కొద్దీ కేంద్రాల సంఖ్య పెరగాలి. వాటి పనితీరు కూడా మెరుగుపడాలి. కానీ చాలా వరకు కేంద్రాలను మూసివేస్తున్నారు. అంగన్​వాడీ సేవిక, సేవకురాళ్లు వేలమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. మరి ఇలా అయితే స్త్రీశిశు సంక్షేమాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?

అవగాహన కల్పించడం ముఖ్యం

మాస్టర్​ఆఫ్​ సోషల్​వర్క్​ స్టూడెంట్​గా నేను దేశ రాజధాని ఢిల్లీలో క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంగన్​వాడీ కేంద్రాల పనితీరును అధ్యయనం చేశా. చిన్నపిల్లలు అంగన్​వాడీకి రావడం, పౌష్టికాహారం తీసుకుపోవడం మాత్రమే కాదు.. అంగన్​వాడీ కేంద్రాలు నెలకొల్పిన ఉద్దేశాలు, లక్ష్యాలు, పనులు చాలా విస్తృతమైనవి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య సరిగా అందటం లేదు. కొన్ని చోట్ల టెండర్​ వేసి ఈ పోషకాహార బాధ్యతను ఎన్జీవోలకు అప్పగిస్తున్నారు. ఆయా ఎన్జీవోలు వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ ఏదో అరకొర వంటలు చేసి పెడుతున్నాయి. సరైన పోషకాహారం పేద పిల్లలకు అందడం లేదు. మహిళలకు, బాలబాలికలకు సంబంధించిన అన్ని రకాల విషయాలపై ప్రతినెల పదిహేను రోజులకొకసారి జరిగే మహిళా మండలి సమావేశంలో అంగన్​వాడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన మహిళలను సమావేశపరిచి పలు అంశాలపై చర్చించాలి. 

కిషోర బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, హార్మోన్​ఉత్పత్తి, రుతుచక్రం విషయాలు, జాగ్రత్తలు, రక్తహీనత, స్త్రీ ఆరోగ్య సమస్యలు, గర్భిణులకు ప్రత్యేక పోషకాహారం, వ్యాధినిరోధకత, టీకాల గురించి మాట్లాడాలి. ప్రసవ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లింగసమానత, శ్రీమంతం, కుటుంబ నియంత్రణ, కాన్పుల మధ్య దూరం ఇలాంటి ఎన్నో విషయాల గురించి చర్చలు పెట్టి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్​వాడీలపై ఉన్నది. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇలా పూర్తి స్థాయిలో జరగడం లేదు. కానీ జరిగినట్లు రికార్డుల్లో రాస్తారు.  నిర్దేశిత అంశాలు పక్కాగా అమలైతే నిరక్షరాస్యత, బాలకార్మికులు, స్కూల్​డ్రాపౌట్లు, బాల్య వివాహాలు, లింగ అసమానతలు ఉండవు. నెలలు నిండకుండానే పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంది. మాతా శిశుమరణాలు తగ్గుతాయి.

పేదల పిల్లలకు న్యాయం జరగాలి

సమాజాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్న అంగన్​వాడీల ప్రగతి అంగన్​వాడీ కార్యకర్తల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అయితే అంగన్​వాడీ కార్యకర్తల వేతనాలు, వారికి ఇతర సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా సరిగా నడవటం లేదు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వారికి సెలవులు ఇవ్వలేదు. బీమా, పెన్షన్​లు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అలవెన్సులు లేవు. తెలుగు రాష్ట్రాల్లో లాగ రాష్ట్ర ప్రభుత్వాలు కొంత చొరవ చూపిస్తున్న ప్రాంతాల్లో అంగన్​వాడీ కార్యకర్తల జీతాలు కొంత మెరుగ్గా ఉన్నా.. దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలీచాలని వేతనాలతో కొనసాగలేక మధ్యలోనే మానేస్తున్నారు. 

దేశంలో లక్షలాది అంగన్​వాడీ సెంటర్లు ఇంకా అద్దె భవనాల్లో, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. అంగన్​వాడీ కేంద్రాలకు ఎక్కువగా కూలీ పని చేసుకొనే పేద తల్లిదండ్రుల పిల్లలు వస్తారు. వారివి రెక్కాడితేగానీ డొక్కాడని జీవితాలు కాబట్టి ఇంట్లో పిల్లలకు పౌష్టికాహారం పెట్టలేరు. అలాంటి వారికి అంగన్​వాడీ కేంద్రాలే ఆధారం. ఇలాంటి సందర్భంలో అంగన్​వాడీ సెంటర్ల నిర్వహణ సరిగా లేకపోతే.. పేదల పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలను పరిచయం చేసే పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమైనది. ఇక్కడ నిర్లక్ష్యం జరిగితే వారి జీవితంపై ప్రభావం పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంగన్​వాడీ సెంటర్లను నిర్లక్ష్యం చేయకుండా, సరైన పర్యవేక్షణ, మార్గదర్శనం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

పర్యవేక్షణ లోపం ఉండొద్దు

అధికారుల పర్యవేక్షణ లేని చోట్ల అంగన్​వాడీ టీచర్, కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదు. రోజూ సెంటర్​ తెరవడం లేదు. సెంటర్​లో ఉండాల్సిన సమయంలో వ్యక్తిగత పనులు చేసుకోవడం, ఎవరూ సెంటర్​కు రాకున్నా.. పేర్లు రాసి, వారి పేరిట సరుకులు అమ్ముకోవడం, పక్కదారి పట్టించడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. నలభై మంది వరకు ఉండాల్సిన అంగన్​వాడీ సెంటర్​లో నలుగురు, ఐదుగురు మాత్రమే ఉంటున్న సందర్భాలు కోకొల్లలు. వారికి కూడా ఏమీ నేర్పించకపోవడం, చెప్పేందుకు టీచర్​ లేకపోవడం, పోషకాహారం వండి పెట్టడానికి అంగన్​వాడీ కార్యకర్త లేక పోవడం.. ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉండటం లాంటి సమస్యలు అంగన్​వాడీ సెంటర్ల అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి.  

బాలికా విద్య అందకపోవడం, పెండ్లి, ఆరోగ్యం, కుటుంబం, కుటుంబ నియంత్రణ లాంటి విషయాలపై అవగాహన లేకపోవడంతో అణగారిన వర్గాలకు చెందిన బాలికలు తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్నతనంలో వివాహాలు చేసుకొని ఇరవై నుంచి 25 ఏండ్లు వచ్చేసరికి ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని కనడం, కుటుంబ, ఆర్థిక సమస్యలు, పిల్లలకు పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదల లోపించడం లాంటి సామాజిక సమస్యలకు అంగన్​వాడీ సెంటర్ల నిర్వహణ లోపం కారణం కాకూడదు. ఇప్పటికైనా అంగన్​వాడీ కార్యకర్తలు జవాబుదారీగా పనిచేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంటర్ల మౌలిక వసతులు, సమస్యలు చూసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- లంక రజని, సోషల్​ వర్క్​ స్టూడెంట్, ఇగ్నో