విద్యారంగంపై సర్కార్‌‌‌‌ నిర్లక్ష్యం ...టీచర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇస్తలేదు: రాంచందర్ రావు

విద్యారంగంపై సర్కార్‌‌‌‌ నిర్లక్ష్యం ...టీచర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇస్తలేదు: రాంచందర్ రావు
  • ట్యాంక్‌‌బండ్‌‌ వద్ద రాధాకృష్ణన్‌‌ విగ్రహానికి నివాళి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్లను, విద్యా రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ట్యాంక్‌‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి గొప్ప గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు రాధాకృష్ణన్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు, విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ టీచర్లకు సకాలంలో జీతాలు రావడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. 

యూనివర్సిటీలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు చేయడమే తప్ప.. ఆచరణలో చూపించడం లేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, టీచర్లకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని డిమాండ్‌‌ చేశారు. సమాజంలో భావితరాలను తీర్చిదిద్దే టీచర్లను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మమని పేర్కొన్నారు.