ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత..జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మెడిసిన్స్: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత..జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మెడిసిన్స్: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
  • రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్​అమలు చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • ఉప్పల్​లో జన ఔషధి వేర్ హౌస్ ప్రారంభం

ఉప్పల్, వెలుగు: జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే మెడిసిన్స్ అందిస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అందరికీ మెడిసిన్స్ అందుబాటులో ఉంచేందుకు సప్లై చైన్​ను మెరుగుపర్చినట్లు చెప్పారు. ‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’ పథకం కింద హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో లోర్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్​ను గవర్నర్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచేందుకు ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ డివైజెస్‌‌‌‌ బ్యూరో ఆఫ్‌‌‌‌ ఇండియా (పీఎంబీఐ) – లార్వెన్ జన ఔషధి డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ వేర్‌‌‌‌హౌస్​ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. ఈ వేర్ హౌస్​తో రాష్ట్రంలోని ప్రతి మూలకూ తక్కువ ధరలో మెడిసిన్స్ వేగంగా చేరుతాయి. పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న లార్వెన్ గ్రూప్ ఎండీ వరుణ్ విహార్ మడుపడుగ, లార్వెన్ గ్రూప్ సీఈవో రాము మడుపడుగకు అభినందనలు. 3వేల రకాలైన మందులు, ఆపరేషన్​కు అవసరమైన మెడిసిన్స్.. వేర్ హౌస్ నుంచి సప్లై అవుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’అని జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

70 ఏండ్లు దాటినోళ్లందరికీ ఆయుష్మాన్ భారత్: కిషన్ రెడ్డి

70 ఏండ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తెలంగాణలోని ప్రతి గల్లీలో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. జన ఔషధి కేంద్రాల ద్వారా అందరికీ మెడిసిన్స్ అందేలా చూస్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వెళ్లిపోయింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఆయుష్మాన్ భారత్‌‌‌‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి. ప్రతి పేదోడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి’’అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తదితరులు హాజరయ్యారు.