
న్యూయార్క్: దీపావళి పండుగ రోజును స్కూళ్లకు సెలవు దినంగా న్యూయార్క్ రాష్ట్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ లా సవరణ బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్ కేథీ హోచుల్ సంతకం చేశారు. దీంతో అది చట్టంగా మారినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈమేరకు ఇండియన్ క్యాలెండర్ ప్రకారం 8వ నెల 15వ తేదీన న్యూయార్క్ స్టేట్‌లోని ప్రభుత్వ స్కూళ్లు మూసివేయాలని ప్రకటన జారీ చేశారు. ‘‘న్యూయార్క్ సిటీ వివిధ మతాలు, సంస్కృతులకు నిలయం.
ఇక్కడ హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మతాలకు చెందిన అనేకమంది దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. స్కూళ్లలో పిల్లలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చర్‌ను గుర్తించేందుకు వేసిన ముందడుగిది”అని కేథీ పేర్కొన్నారు. దీపావళి పండుగను గుర్తించాలని కోరుతూ కొన్నేండ్లుగా చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కిందని న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.