ములుగు హార్టికల్చర్ వర్సిటీ కాన్వొకేషన్​లో గవర్నర్​ తమిళిసై​

ములుగు హార్టికల్చర్ వర్సిటీ కాన్వొకేషన్​లో గవర్నర్​ తమిళిసై​

గజ్వేల్, వెలుగు: ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచే పంటలను డెవలప్​చేసేలా రీసెర్చ్ ​జరగాలని గవర్నర్, ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ చాన్స్​లర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని హార్టికల్చర్ యూనివర్సిటీ రెండో కాన్వొకేషన్​కు ఆమె చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కు డిగ్రీ పట్టాలు, పీహెచ్​డీ చేసినవారికి డాక్టరేట్ లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ న్యూట్రిషన్స్ తో పాటు ఇమ్యూనిటీని పెంచే పంటలను డెవలప్​ చేయాలన్నారు. మన పూర్వీకులు తీసుకున్న ఆహారంపై పరిశోధనలు చేసి మళ్లీ తీసుకురావాలన్నారు. కరోనా వైరస్ న్యూట్రిషన్​ ఫుడ్​విలువను ప్రపంచానికి తెలిపిందన్నారు. ప్రజలకు హెల్దీ ఫుడ్​ను అందించే వంగడాలను సృష్టించేలా స్టూడెంట్స్​ పరిశోధనలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డా. ఆనంద్ కుమార్ సింగ్, రిజిస్ట్రార్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్ పాటించని ఆఫీసర్లు 

గవర్నర్​పర్యటన సందర్భంగా సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్​పాటించలేదు. కలెక్టర్, ఎస్పీ ఆమెకు స్వాగతం పలకాల్సి ఉండగా.. ములుగు తహసీల్దార్​ ప్రవీణ్​రెడ్డి, గజ్వేల్​ఏసీపీ ఆహ్వానించారు. గవర్నర్​ జిల్లాకు రావటం ఇది రెండోసారి. గతంలో కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చినపుడు కూడా కలెక్టర్, సీపీ హాజరు కాలేదు.